ఆత్మీయానుబంధం | ys sharmila paramarsha yatra in nalgonda | Sakshi
Sakshi News home page

ఆత్మీయానుబంధం

Published Wed, Jun 10 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

ఆత్మీయానుబంధం

ఆత్మీయానుబంధం

తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబ సభ్యులను పలకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుమార్తె...

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబ సభ్యులను పలకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర జిల్లాలో రెండో రోజు కొనసాగింది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడిన షర్మిల వారితో ఆత్మీయంగా గడిపి ఆత్మస్థైర్యాన్ని నింపారు.

వైఎస్ కోసం చనిపోయిన వారి కుటుంబాలు తమ కుటుంబంతో సమానమని, ఆయా కుటుంబాల సభ్యులకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి స్వగ్రామమైన మోత్కూరు మండలం పొడిచేడు వెళ్లిన షర్మిల తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 మూడు నియోజకవర్గాలు..ఆరు కుటుంబాలు
 రెండో రోజు షర్మిల పరామర్శయాత్ర జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సాగింది. తొలుత ఆలేరు మండల కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్ర అదే మండలంలోని శారాజీపేట గ్రామానికి చేరుకుంది. అక్కడ ఎదుళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల కలిసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనివాస్ తల్లి పెద్దమ్మ ఆరోగ్యాన్ని గురించి వాకబు చేసిన షర్మిల ఆమెను క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. పెద్దమ్మ మనుమడు దుర్గాప్రసాద్‌ను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వైఎస్ పాలనను కీర్తిస్తున్న సందర్భంలో షర్మిల మాట్లాడుతూ చెట్టంత మనిషి పోతే ఎవరికైనా బాధగానే ఉంటుందని, మనకూ మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. షర్మిల బయటకు వచ్చిన సమయంలో ఓ చిన్నారి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకుందని ఆమె తల్లిదండ్రులు షర్మిలకు చూపించారు. ఆ తర్వాత మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి వెళ్లి అక్కడ బీతి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలిశారు. గౌరమ్మ ఇల్లు శిథిలావస్థ చేరుకుని ఉన్నప్పటికీ అదే ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు.

అంతకు ముందు పొడిచేడులో రహదారిపై ఉన్న తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా నినాదాలిచ్చారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు... జోహార్ శ్రీకాంత్‌చారి అంటూ ఆయన నినాదాలివ్వడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆయనతో గొంతు కలిపారు. అక్కడి నుంచి రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో అమ్మనబోలు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఆ తర్వాత సిరిపురం గ్రామానికి వెళ్లి పున్న వీరయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ షర్మిలను చూడగానే వీరయ్య భార్య బాలనర్సమ్మ బోరున విలపించింది. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన షర్మిలను చూసిన ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎవరూ అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. బాలనర్సమ్మను బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు చెప్పి ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆ తర్వాత సిరిపురం చేనేత సొసైటీని సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా కట్టంగూరు మండల కేంద్రానికి బయలుదేరి మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనాన్ని పూర్తి చేసుకున్నారు.

కట్టంగూరులో గాదగోని రాములు కుటుంబాన్ని కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా రాములు భార్య సైదమ్మ షర్మిల చేతిలో చేయి వేసి తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని చెప్పిన షర్మిల అక్కడి నుంచి న కిరేకల్ మండలం మరూరు గ్రామానికి వెళ్లి అక్కడ పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకున్నారు. సైదులు మనుమరాలు కావ్యను దగ్గరకు తీసుకుని ఏం చదువుతున్నావని ప్రశ్నించారు.

స్కూల్లో అన్నం పెడుతున్నారా అని షర్మిల అడిగినప్పుడు ‘మధ్యాహ్నం 12 గంటలకు అన్నం పెడతారు.’ అని బదులిచ్చింది. అక్కడ సైదమ్మ కుటుంబ సభ్యుడయిన ఓ వ్యక్తికి భార్యా పిల్లలను బాగా చూసుకోవాలని, ఏవైనా అలవాట్లు ఉంటే మానుకుని కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత షెడ్యూల్‌లో లేకున్నా కేతేపల్లి మం డలం బీమారం గ్రామానికి వెళ్లి నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ తండ్రి, భార్యాపిల్లలతో మాట్లాడారు. అనంతరం రెండోరోజు యాత్రను ముగించుకుని నకిరేకల్‌లో రాత్రి బస చేశారు.

 1000 మగ్గాలు... 500 అయ్యాయి
 షర్మిల రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి వెళ్లిన సందర్భంగా ఆమెను చేనేత  సొసైటీకి రావాలని స్థానికులు ఆహ్వానించారు. వెంటనే అంగీకరించిన ఆమె సొసైటీకి వెళ్లి అక్కడి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు షర్మిలతో మాట్లాడుతుండగా, నెలకు ఎంత ఆదాయం వస్తుందని షర్మిల ప్రశ్నించారు. కష్టపడి పనిచేస్తే నెలకు 3వేల రూపాయలు వస్తాయని చెప్పడంతో మరి ఎలా నెట్టుకొస్తున్నారని షర్మిల ప్రశ్నించారు.

అందుకే ఇబ్బందిగా ఉందని, గతంలో 1000 మగ్గాలున్న గ్రామం 500 మగ్గాలకు చేరుకుందని, చాలా మంది వేరే వృత్తులను ఎంచుకుంటున్నారని, కొందరు వలస వెళుతున్నారని, లేదంటే ఆత్మహత్యల పాలవుతున్నారని చెప్పారు. గతంలో వైఎస్సార్ కూడా ఈ గ్రామానికి వచ్చి సొసైటీని సందర్శించారని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదాలో 2003లో వచ్చిన ఆయన చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేశారన్నారు. ఆయన చేసిన చేనేత రుణమాఫీ తమకు ఎంతో మేలు చేసిందని, ఆరోజున వైఎస్ వచ్చినప్పుడు గ్రామంలో భారీ వర్షం వచ్చిందని షర్మిలకు వారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా షర్మిలకు సొసైటీ సభ్యులు దుప్పటిని బహూకరించారు.

 ఆత్మీయ స్వాగతం
 షర్మిల పరామర్శకు వెళ్లిన సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు పెద్దఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. గ్రామగ్రామాన డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర నుంచే ర్యాలీగా ఆమెను గ్రామంలోకి నడిపించుకుంటూ తీసుకెళ్లి తమ ఆప్యాయతను చాటుకున్నారు. షర్మిల పరామర్శకు వెళ్లినప్పుడు ఆమె పరామర్శను పూర్తి చేసుకుని బయటకు వచ్చేంతవరకు ఓపికతో ఉండి ఆమెను కలిసి మురిసిపోయారు. తమతో కరచాలనం చేయాలని పోటీలు పడ్డారు. షర్మిలను తమ కెమెరాల్లో బంధించారు.

రాజన్న బిడ్డ వచ్చిందంట అంటూ ఉరుకుల పరుగుల మీద ఆమె వద్దకు వచ్చి కలుసుకున్నారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిల వెంకన్న గౌడ్, కార్యదర్శులు వడ్లోజు వెంకటేశం, వేముల శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, ఎండి.సలీం, ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలెంల మధు, బీసీ సెల్ అధ్యక్షుడు ముశం రామానుజం, యువజన విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్, జిల్లా కోశాధికారి పిల్లి మరియదాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 నేటి పరామర్శ యాత్ర షెడ్యూల్

 నల్లగొండ : పరామర్శ యాత్ర మూడో రోజు గురువారం జిల్లాలో కొనసాగుతుంది. నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుం టి వెంకటేశం కుటుంబం, తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం, అదే విధంగా నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం,  మర్రిగూడెం మండలం తాన్‌దార్‌పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం, నాంపల్లికి చెందిన  అస్తర్‌బీ, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు  కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement