నేనున్నానని...

Young Man Helps Children Education in Hyderabad - Sakshi

పిల్లల చదువులకు ఓ యువకుడి చేయూత

40 మంది చిన్నారులకు సొంత ఖర్చుతో విద్య

వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 40 శాతం వినియోగం

ఉచిత చదువుతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు

ఆదర్శంగా నిలుస్తున్న ప్రశాంత్‌ కుమార్‌

అతనొక ఉద్యోగి. భావితరాల చిన్నారులకు విద్యను అందించాలనే తపనతోఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులను కలిశాడు. ‘మీ పిల్లలను నేను చదివిస్తాను. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే వరకు నాదే బాధ్యత..’ అంటూ భరోసా ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే ఎంత ప్రయోజకులు అవుతారనే విషయాల్ని ల్యాప్‌టాప్‌ ద్వారా చూపించాడు. వారిని ఒప్పించాడు. అందుకోసం తల్లిదండ్రుల వద్ద తెల్లపేపర్‌పై ‘మీ పిల్లల భవిష్యత్‌కు నేనే బాధ్యడ్నంటూ’ రాసి నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రశాంత్‌ కుమార్‌ బోనగిరి.

సాక్షి, సిటీబ్యూరో:రామంతపూర్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్‌ బోనగిరి ‘శ్రీ వాసవి చారిటబుల్‌’ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేశాడు. ఉచితంగా అనాథలకు, చదువుకోలేని వారికి విద్యను అందిస్తున్నాడు. వృత్తిరీత్యా పెయింటర్‌. అదే విధంగా ‘మ్యాన్‌ పవర్‌ సొల్యూషన్‌’ కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ ద్వారా వచ్చే తన ఆదాయంలో కొంత భాగాన్ని పక్కనపెట్టి స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు.  

ఆదాయంలో 40 శాతం ట్రస్ట్‌కే...
పెయింటింగ్‌లో ప్రశాంత్‌ మంచి ప్రతిభావంతుడు. నెలకు మూడే మూడు పెయింటింగ్స్‌ వేస్తాడు. ఒక్కో పెయింటింగ్‌ని రూ.10 వేలకు అమ్ముతాడు. ఈ పదివేల నుంచి 40 శాతం పక్కకు తీసి ట్రస్ట్‌కు వాడతాడు. అదేవిధంగా సొంతంగా ‘మ్యాన్‌పవర్‌ సొల్యూషన్‌’  కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారా సెక్యూరిటీ గార్డులను కార్పొరేట్‌ కంపెనీలకు రిక్రూట్‌ చేస్తాడు. ఈ కంపెనీ ద్వారా దాదాపు నెలకు రూ.2 లక్షల ఆదాయం వస్తే..దానిలో 40 శాతం ట్రస్ట్‌కు వినియోగిస్తున్నాడు. ఇలా ఈ డబ్బుతో ఇప్పటివరకు ప్రత్యక్షంగా 40 మందిని చదివిస్తుండగా..50 మందికి పైగా విద్యార్థులకు అవసరమైన సదుపాయాల్ని కల్పిస్తున్నాడు ప్రశాంత్‌.  

నేనే బాధ్యుడ్ని అంటూ అగ్రిమెంట్‌
నగరంతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలకు చెందిన అనాథలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన చిన్నారులను స్వయంగా చదివిస్తున్నాడు. చదువు మానేసి ఇంటిపట్టున ఉంటూ..కుటుంబానికి ఆసరాగా ఉంటున్న వారిని గుర్తించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్లాడు. వాళ్ల తల్లిదండ్రులను బతిమిలాడాడు. వారు ఒప్పుకోకపోవడంతో..‘మీ పిల్లల చదువులు అయ్యే వరకు నేనే చూసుకుంటా. చదువుకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ నేనే తీరుస్తా. ఉద్యోగం వచ్చే వరకూ నాదే బాధ్యత’ అంటూ అగ్రిమెంట్‌ కూడా రాసి వారికి ఇవ్వడం జరిగింది. ఇలా 15 మంది చిన్నారుల తల్లిదండ్రులకు అగ్రిమెంట్‌ రాసినట్లు ప్రశాంత్‌ తెలిపారు.  

సేవల్లోభేష్‌
నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా బుక్స్, పెన్నులు, బట్టలు, బూట్లు ఇవ్వడం చేస్తుంటాడు. బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ను పంపిణీ చేస్తాడు. టాయ్‌లెట్స్‌ని క్లీన్‌ చేయించడం, మంచి తాగునీరు అందించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఇటీవల రామంతపూర్‌కి చెందిన లక్ష్మమ్మ అనే ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి పింఛన్‌ రావట్లేదు. విషయం తెలుసుకున్న ప్రశాంత్‌ ఆ వృద్ధురాలికి సొంత ఖర్చులతో టీ స్టాల్‌ని ఏర్పాటు చేశాడు. యోగిత అనే విద్యార్థినికి తండ్రి లేడు. చదువు భారం కావడంతో ఆమెను ఉచితంగా చదివిస్తున్నాడు. పీజీ పూర్తయ్యే వరకు తనదే బాధ్యతంటూ ఆమె తల్లికి భరోసా ఇచ్చాడు. వర్షకాలంలో రాజేంద్రనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో 50 మంది విద్యార్థులకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేశాడు.

మరికొద్దిరోజుల్లోఉచితంగా వాటర్‌ట్యాంకులు
ప్రస్తుతానికి నాకు వచ్చే ఆదాయంలో 40 శాతం ట్రస్ట్‌కు ఖర్చు పెడుతున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరినీ ఒక్క రూపాయి అడగలేదు. కొద్దిరోజుల్లో నా వ్యాపారంలో మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ఆదాయంతో నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా వాటర్‌ట్యాంక్స్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నా. నా శక్తిమేరకు ఎంతమందిని చదివించగలిగితే అంతమందిని చదివించేందుకు నేను సిద్ధం.    – ప్రశాంత్‌కుమార్, ట్రస్టు వ్యవస్థాపకులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top