పాతికేళ్లకే టీబీ

World Tuberculosis Day - Sakshi

ఏటా 15 వేల కొత్త కేసులు    

గ్రేటర్‌లో చాపకింది నీరులా విస్తరిస్తున్న వైనం

బాధితుల్లో యువకులు, మధుమేహులు కూడా

నేడు ప్రపంచ టీబీ దినోత్సవం

ఒకప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ఎయిడ్స్‌ రోగుల్లో మాత్రమే టీబీ లక్షణాలు కన్పించేవి. అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం.. చిన్న తనంలోనే స్మోకింగ్‌కు అలవాటు పడటం, విటమిన్‌ డి లోపం తదితర కారణాలతో యుక్తవయసులోనే వెలుగు చూ స్తుండటంపైసర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నెల 24న ప్రపంచటీబీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..!  

సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు నగరాన్ని స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వణికిస్తుండగా ఇప్పుడా స్థానాన్ని ట్యూబరిక్లోసిస్‌(టీబీ)ఆక్రమించింది. నగరంలో క్షయ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో ఏటా కొత్తగా సుమారు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ఎయిడ్స్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, మధుమేహం తర్వాత అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా క్షయను పరిగణిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష మందికి పైగా ఎయిడ్స్‌ రోగులు ఉండగా, వీరిలో మూడొంతుల మంది టీబీతో బాధపడుతున్నట్లు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి వైద్యుల సర్వేలో వెల్లడైంది. గతేడాది హైదరాబాద్‌లో 7 వేలు, రంగారెడ్డి జిల్లాలో 6 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరిలో 12 ఏళ్లలోపు వారు 10 శాతం ఉంటే, 25–50 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం మంది ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 41, రంగారెడ్డిలో 48 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా, వీటిలో చాలా చోట్ల ల్యాబ్‌ టెక్నిషియన్లు లేరు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 

ఒకరి నుంచి 15 మందికి..: ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొత్తగా తొమ్మిది మిలియన్ల మంది టీబీ బారిన పడుతుండగా వీరిలో సుమారు 1/3 వంతు బాధితులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే టీబీ ఎక్కువ ఉన్న దేశం మనదే కావడం గమనార్హం. దేశంలో ప్రతి సెకనుకు ఒకరు టీబీ బారిన పడుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చొప్పున..రోజుకు వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్కన్న దేశంలో ఏటా మూడు లక్షల మంది టీబీతో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్కో టీబీ రోగి తను చనిపోయేలోగా మరో 15 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తున్నాడు. సంతానలేమితో బాధపడుతున్న చాలా మందిలో గర్భాశయ టీబీ కనుగొనబడుతుంది. టీబీ సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరి యా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది . ఇలా ఒకసారిగాలిలో కి ప్రవేశించిన బ్యాక్టీరియా 18–20 గంటల పాటు జీవిస్తుంది. ప్రతి వ్యక్తికి టీబీ ఉన్నా, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే అది బయట పడుతుంది. మనిషి శరీరంలో ఎంత కాలమైనా ఇది జీవిస్తుంది. శీతల గదిలో 8–10 రోజులు జీవిస్తుంది. గోర్లు, వెంట్రుకలకు మినహా శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకుతుంది. 

లక్షణాలు ఇలా గుర్తించవచ్చు
సాయంత్రం, రాత్రిపూట తరచూ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం.
ఆకలి, బరువు తగ్గడం, నీరసం,ఆయాసం, ఛాతిలో నొప్పి ఉంటుంది.
తెమడ పరీక్ష ద్వారా వ్యాధినినిర్ధారిస్తారు.
ఆరు మాసాలు విధిగా మందులువాడాలి.  
బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు వాడాలి.
బలవర్థకమైన ప్రొటీన్ల(గుడ్లు, పప్పు, పాలు)తో కూడిన ఆహారం తీసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక స్పహ కలిగి ఉండాలి.– డాక్టర్‌ రమణప్రసాద్, కిమ్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top