
2050కల్లా 45 కోట్ల మందికి
లాన్సెట్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: మిరపకాయ బజ్జీ. మైసూర్ బోండా. పిజ్జా. బర్గర్. ఇలా జంక్ ఫుడ్‌ను భారతీయులు మితిమీరి తింటున్నారట. ఫలితంగా జనాభాలో చాలామంది స్థూలకాయ సుడిగుండంలో చిక్కుతున్నారని ప్రఖ్యాత లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఈ సమస్య దేశాన్ని నిశ్శబ్ద సునామీలా చుట్టేస్తోందని ప్రమాదఘంటికలు మోగించింది.
2050కల్లా దేశంలో మూడోవంతు, అంటే 45 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడటం ఖాయమని ‘ది లాన్సెట్ ప్రాజెక్ట్స్’ పేరిట ప్రచురించిన అధ్యయనంలో కుండబద్దలు కొట్టింది. 22 కోట్ల మంది పురుషులు, 23 కోట్ల మంది స్త్రీలు సమస్య బారిన పడతారని అంచనా వేసింది. స్థూలకాయం వల్ల టైప్–2 మధుమేహం, గుండె, శ్వాసకోశ, కాలేయ, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం, క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతాయని హెచ్చరించింది.
సర్వాంతర్యామి
స్థూలకాయం నగరాలు, అధికాదాయ కుటుంబాలకే పరిమితం కావడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. మధుమేహ బాధితుల్లో భారతీయులే ఎక్కువని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. జనాభాలో 10 కోట్ల మందికి పైగా దాని బారిన పడ్డట్టు అంచనా. యుక్త వయసు్కల్లోనూ షుగర్ సమస్యలు పెరుగుతుండటం ఆందోళనకరమేనని అధ్యయనం పేర్కొంది.
అధిక బరువే దీనికి మూలమని ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగ అదనపు అధ్యాపకుడు డాక్టర్ నీరజ్ నిశ్చల్ అన్నారు. ‘‘ఒబెసిటీ విజృంభణ భారత్‌లో వ్యాధుల ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. సమస్యకు వెంటనే పరిష్కారం వెతక్కపోతే ఆరోగ్య, ఆర్థిక రంగాలకు పెనుభారంగా మారుతుంది’’ అన్నారు. ‘‘ఒకప్పుడు వ్యక్తిగత సమస్య అయిన స్థూలకాయం ఇప్పుడు దేశ సమస్యగా మారుతోంది.
స్కూళ్లు, కార్యాలయాల నుంచి ఆస్పత్రులదాకా అంతటా దీనిపై అవగాహన కలి్పంచాలి’’ అని సూచించారు. ‘‘స్థూలకాయం నిజంగానే నిశ్శబ్ద సునామీ. పైకి కనిపించకుండా దీర్థకాల సమస్యలకు దారితరరీస్తుంది. దీన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రకటించాలి. వ్యవస్థీకృత ప్రజారోగ్య సవాల్‌గా పరిగణించి సంస్థాగత స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలి’’ అని గంగారాం ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మొహ్‌సిన్ వాలీ అన్నారు.
‘‘పోషకాహారంపై ప్రజలకు అవగాహన పెంచాలి. ఆహార పదార్థాల్లో పరిమితికి మించి కృత్రిమ పదార్థాల జోడింపు తదితరాలపై తనిఖీలు పెంచాలి. స్థూలకాయానికి ప్రభుత్వరంగ సంస్థలను జవాబుదారీగా చేయాలి’’ అన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. ‘‘ఒబెసిటీ దెబ్బకు భావి తరాల ఆయుర్దాయం బాగా తగ్గే ప్రమాదముంది. దేశ శ్రామికశక్తి సామర్థ్యాలను తగ్గించి ఆర్థికాభివృద్ధికి ఇది ప్రతిబంధకంగా మారుతుంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఒబెసిటీ రోగులకు, సాంక్రమణేతర వ్యాధి సంక్షోభానికి భారత్ ప్రపంచ కేంద్ర స్థానంగా మారడం ఖాయం’’ అని హెచ్చరిస్తున్నారు.