వినిపించని ఆకాశ 'వాణి'

World Radio Day Special Story Siddipet - Sakshi

 నాటి తరాన్ని అలరించిన రేడియో

నేడు కనుమరుగైన వైనం

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం..  అని రేడియో నుంచి మాటలు వినగానే నా మనస్సులో వార్తలు వినాలనే కుతూహలం పెరిగేది. కానీ నేడు ఈ రేడియోలు లేక టీవీలో వార్తలు సక్రమంగా వినలేకపోతున్నానంటూ తనకు రేడియోతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సిద్దిపేట పట్టణానికి చెందిన రాజయ్య. కేవలం రాజయ్య మాత్రమే కాదు అనేక మంది రేడియోతో అనుబంధం ఉన్నవారు అందరూ ఇదే విధంగా రేడియోను గుర్తు చేయగానే ఇలానే తమ అభిప్రాయాలు వెల్లడించారు. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... 

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): గతంలో ఒక చోట నుంచి మరొక చోటుకు సందేశాలు, విషయాలు చేరాలంటే కేవలం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది, లేదంటే వ్యక్తి అక్కడికి వెళ్లడంతో మాత్రమే విషయం తెలిసేది. కాలక్రమంలో రేడియోల స్థానంలో టీవీలు వచ్చాయి. దీంతో అనేక సంవత్సరాల వైభవం పొందిన రేడియోలు నేడు ఎక్కడో ఒక చోట మాత్రమే దర్శనమిస్తున్నాయి. కేవలం ప్రధాని నరేంద్రమోడీ ప్రతీ నెలా దేశ ప్రజలకు అందించే సందేశాన్ని వినడానికి మాత్రమే అక్కడక్కడ రేడియోలు ఉన్నాయి.  రేడియోలకు అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక యుద్ధాల విషయాలు, విశేషాల విషయాలను ప్రజలకు తెలియజేసిన చరిత్ర రేడియోలది. అదే విధంగా ప్రపంచంలోనే శాంతియుతంగా స్వాతంత్య్రం సాధించిన భారత్‌ను కదిలించిన నాయకుల ప్రసంగాలు, తదితర విషయాలను ఈ రేడియోలే నాడు ప్రజలకు ప్రచార మాద్యమాలుగా నిలిచి, ప్రజలను ఐక్యంగా చేశాయి. ఇంతటి విశిష్టత ఉన్న రేడియోలు నేడు కనుమరుగవుతుండటం చింతించవలిసిన విషయం. అయినా నేటికి కూడా రేడియోలో వార్తలు వినే వారు, అదేవిధంగా ఎఫ్‌ఎమ్‌ లో పాటలు వినే వారు ఉన్నారు.  అదే విధంగా దూరవిద్య పాఠాలు ఈ రేడియో ద్వారానే నేటికి వింటున్నారు.

నాడు కాలక్షేపం ఈ రేడియోలే...
నేడు టీవీలు, కంప్యూటర్‌లు, సెల్‌ఫోన్‌లు లేని ఇళ్లు, వ్యక్తులు లేరంటే ఆశ్యర్యపోవాల్సిందే. కానీ నాడు ఇంటికో రేడియో ఉంటే అదే గొప్పని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ రేడియోలతోనే ప్రజల్లో చైతన్యం  కలిగింది.   వ్యవసాయం, పాడిపాంట, రైతే రాజ్యం తదితర పేర్లతో రేడియోలతో వ్యవసాయ సమాచారం, జానపదకథలు, బుర్రకథలు,  ఒగ్గుకథలు, సినిమా పాటలు, క్రికెట్‌ కామెంట్రీలు ఈ రేడియోల ద్వారానే వినేవారమని అనేక మంది వృద్ధులు తమ  అనుభవాలను తెలపడం విశేషం.  

షాప్‌లో సందడిగా ఉండేది..
1977 నుంచి రేడియో మెకానిక్‌గా షాప్‌ నిర్వహిస్తున్నాను. అప్పుడు చేతి నిండా పనులు ఉండేవి. అనంతరం టేప్‌రికార్డ్‌లు వచ్చాయి. తర్వాత టీవీలు రంగప్రవేశం చేశాక వివిధ మోడళ్లలో టీవీలు రావడంతో పనులు పూర్తిగా తగ్గాయి. రేడియోలు ఉన్నతం కాలం షాప్‌ నిండా రేడియోలే ఉండేవి. షాప్‌లో ప్రజలతో సందడిగా ఉండేది, నేడు ఆ సందడి లేదు.   –విజయ్‌కుమార్,రేడియో మెకానిక్, సిద్దిపేట

సంవత్సరానికి వంద మాత్రమే విక్రయిస్తున్నాం
సిద్దిపేట జిల్లాలో కేవలం మా షాప్‌లో మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. రేడియోలు అవసరం ఉన్నవారు ఖరీదు కోసం మెదక్, సిరిసిల్ల, కరీంనగర్, తదితర జిల్లా వాసులు, పాఠశాలలకు మా దగ్గరి నుంచే రేడియోలు ఖరీదు చేస్తున్నారు. మేము ఢిల్లీ నుంచి ఈ రేడియోలను ఖరీదు చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి కేవలం 100 వరకు మాత్రమే రేడియోలు విక్రయిస్తాం. టీవీలు రావడం ద్వారా వీటి విక్రయాలు పూర్తిగా తగ్గాయి. వీటి ధరలు రూ.750 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి –చంద్రశేఖర్, వ్యాపారస్తడు, సిద్దిపేట  

రేడియోలోనే విషయాలు తెలిసేవి
చిన్నతనంలో ఏ వార్తలు అయిన కేవలం రేడియో ద్వారా మాత్రమే వినేవాళ్లం.  ప్రతి రోజు మా గృహంలో వ్యవసాయ సంబంధిత వార్తలతో పాటుగా, ధాన్యం రేట్లు, తదితర రేట్లను ఈ రేడియోల ద్వారానే వినేవాళ్లం. వార్తల సమయాలను గుర్తుకు పెట్టుకుని ఆ సమాయల్లో తప్పని సరిగా వార్తలు వినేవాళ్లం. నేటికి కూడా అప్పడప్పడు టీవీలోనే ఎఫ్‌ఎమ్‌ ద్వారా ఆకాశవాణి ప్రసారాలను వింటున్నాను.–ఆత్మారాములు, సిద్దిపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top