వారంతే.. పనులింతే! | works are not done properly | Sakshi
Sakshi News home page

వారంతే.. పనులింతే!

Sep 14 2014 1:54 AM | Updated on Sep 2 2017 1:19 PM

జిల్లాలో జడ్‌పీ జనరల్ ఫండ్ నిధులతో చేపడుతున్న పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కాలవ్యవధి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఏళ్లుగా పనులు చేపడుతున్నారు.

జిల్లాలో జడ్‌పీ జనరల్ ఫండ్ నిధులతో చేపడుతున్న పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కాలవ్యవధి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఏళ్లుగా పనులు చేపడుతున్నారు. పట్టించుకోవాల్సిన ఇంజినీర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పలు పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పనులు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది.
 
ఇందూరు: జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నిధులతో జిల్లా లో చేపడుతున్న పనులు ఓ పట్టాన పూర్తికావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక ఏళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ ఇంజినీర్లు కాంట్రాక్టర్‌ల మూమూళ్లకు అలవాటుపడి వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఇదీ సంగతి..

జిల్లాలో 2011 నుంచి 2014 వరకు జడ్‌పీ జనరల్ ఫండ్ పనులు మొత్తం 393 గుర్తించారు. వీటికి రూ.5.49 కోట్ల నిధులు కేటాయించారు. ఇంజినీరింగ్‌అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్‌లకు పనులు అప్పగించారు. ఇప్పటి వరకు 258 పనులు పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. కానీ, నిజానికి ఇందులో చాలా పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 66 పనులు నిర్మాణంలో ఉండగా, ఇంకా 69 పనులకు నేటి వరకు ప్రారంభించ లేదు.  
 
ఈ సంవత్సరాలలో..

కొనసాగుతున్న, ప్రారంభం కాని పనులలో దాదాపు 2011-12, 2012-13 సంవత్సరానికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కాల వ్యవధి ముగిసినా కాంట్రాక్టర్ లను అనే నాథుడే కరువయ్యాడు. దీంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. అప్పగించిన పనిని గడువులోగా పూర్తిచేయని కాంట్రాక్టర్‌లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి నోటీసులు ఇచ్చి హెచ్చరించాలి. అలా వినకుంటే వారి డిపాజిట్లు బ్లాక్ చేసి, కాంట్రాక్టర్ లెసైన్స్‌ను రద్దుచేయాలి. కాని ఇ లాంటి చర్యలు జిల్లాలో ఒక్కటైనా కానరావడంలేదు. నిజాయితీ అధికారి ఎవరైనా కాంట్రాక్టర్‌కు నోటీసులిస్తే నాయకుల అండదండలతో బయటపడుతున్నారు.
 
పట్టించుకునేదెవరు?..

పనులు ఎక్కడి వరకు వచ్చాయో పరిశీలించేందుకు ఇంజినీరింగ్ అధికారులు గ్రామాలలో, మండలాలలో తిరిగిన దాఖలాలు లేవు. దీంతో పనులు నత్తనడకన సాగు తున్నాయి. పనులు ప్రారంభం కాకున్నా ప్రారంభించినట్లుగా కాంట్రాక్టర్‌లు తెలపడంతో, వాటినే రిపోర్టులో చేర్చి ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. అసలు పనులు జరగుతున్నాయా? లేదా? పనులెన్ని ప్రారంభించారు అన్న వాస్తవ విషయాల జోలికి మాత్రం పోవడం లేదు.
 
జడ్‌పీలో చర్చకు...

జడ్‌పీ జనరల్ ఫండ్ పనులు ఏళ్లుగా పూర్తి కాకుండా, ప్రారంభానికి నోచుకోకుండా ఉండటంతో జిల్లా పరిషత్ అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా పనులు ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు అన్న వివరాలను క్షేత్రస్థాయి నుంచి సీఈఓ రాజారాం తెప్పించుకుంటున్నా రు. ఎంపీడీఓలు స్థానికంగా ఉన్న పనుల వద్దకు వెళ్లి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా ఈ నెల 15న జరిగే సర్వ సభ్య సమా వే శంలో చర్చించనున్నారు. గడువు దాటిన పూర్తి కాని పనులను త్వరగా పూర్తి చేయడానికి ఒక తేదీని నిర్ణయించి, ఇంజినీర్లకు, కాంట్రాక్టర్‌లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రారంభం కాని పనులను దాదాపు రద్దు చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement