ఉపకార వేతనాలు రావట్లే..

Women Self Help Group Children Not Getting Scholarships - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల పిల్లల చదువుల కోసం మంజూరు చేసే ఉపకార వేతనాలు నిలిచి ఏళ్లు గడుస్తున్నాయి. అభయహస్తం, ఆమ్‌ ఆద్మీ బీమా యోజన పథకాల కింద 2014లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ఆ తర్వాత ఈ మంజూరు ప్రక్రియ నిలవడంతో పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత కరువైంది. ఇటు మహిళల పొదుపును ప్రోత్సహిస్తూనే..వారి పిల్లల చదువులకు పోత్సాహకం అందించే ఉద్దేశంతో ఈ పథకాలు గతంలో అమలైనప్పటికీ..ఇప్పుడు పట్టింపు కరువైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులను ఎంపిక చేసినా.. ఆ తర్వాత రెండేళ్లుగా అసలు ఊసే లేదు.

అభయహస్తం, ఆమ్‌ఆద్మీ బీమా యోజన పథకాలకు నగదు చెల్లిస్తున్న మహిళల పిల్లలకు లబ్ధి కలగట్లేదు. 2014–15 ఏడాదికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1,200 అందజేశారు. ఆ తర్వాతి ఏడాది జాబితా రూపొందించినా స్కాలర్‌షిప్‌లు మాత్రం రాలేదు. 2015–16 ఏడాదిలో అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకాలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు 18,943 మంది విద్యార్థులకు రావాల్సి ఉంది. అయితే 2014–15 అభయహస్తం, ఆమ్‌ఆద్మీయోజన పథకం కింద 23,698 మంది విద్యార్థులకు రూ.2,84,36,400 ఉపకార వేతనాలు అందించారు. మరో 1,200 మందికి రావాల్సి ఉంది. 2014–15, 2015–16 సంవత్సరాలకు గాను 20,143 మందిని ఉపకార వేతనాలకు అర్హులుగా అధికారులు గుర్తించారు. విద్యార్థుల డాటాను సైతం అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీరికి కూడా ఒక్కో విద్యార్థికి రూ.1,200 చొప్పున ఉపకార వేతనం రావాలి.

మొత్తం రూ.2,41,71,600 అందించాల్సి ఉంది. ఆర్థికంగా వెనుకబడి మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి పొదుపు చేసుకుంటున్న సభ్యుల పిల్లలు చదువుకునేందుకు ప్రకటించిన ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఊసెత్తకపోవడంతో సభ్యుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 2016–17, 2017–18లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టలేదు. ఉపకార వేతనాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయలేదు. దీంతో అభయహస్తం, ఆమ్‌ఆద్మీబీమా యోజన పథకంలో నగదు చెల్లిస్తున్న మహిళా సభ్యులు అసలు ఉపకార వేతనాలు ఇస్తారా..? ఇవ్వరా..? అనేది అర్థంగాక అయోమయానికి గురవుతున్నారు. అయితే..ఈసారైనా ప్రభుత్వం తమ పిల్లల చదువులకు సాయం చేస్తుందని మహిళా సంఘాలు ఆశిస్తున్నాయి. పథకాల లబ్ధిని అందించకపోతే కనీసం తాము చెల్లించిన నగదు అయినా తిరిగి ఇస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటామనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సర్కారు ఏమైనా మార్గదర్శకాలు జారీ చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top