హ్యాట్సాఫ్‌ సుమ!

Women Rescue For Public Health in Warangal - Sakshi

బావిలో పడిన నక్క కళేబరం తొలగింపు

మునిసిపల్‌ అధికారులు స్పందించకున్నా..  

ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సాహసించిన మహిళ

మహబూబాబాద్‌ రూరల్‌: నీళ్లు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదనే ఉద్దేశంతో తాగునీటి బావిలోని నక్క కళేబరాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సాహసం చేసి తొలగించింది. మహబూబాబాద్‌ మండలం బేతోల్‌ గ్రామ శివారులోని నల్లా బావిలో ఓ నక్క పడి రెండు రోజులవుతోంది. ఆ మూగజీవి నరకయాతన పడుతుండటంతో మాజీ సర్పంచ్‌ సంతోష్‌ శుక్రవారం ’నేను సైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సుమకు సమాచారం అందించారు.

ఆమె బావి వద్దకు చేరుకునే సరికి అప్పటికే నక్క చనిపోయి కళేబరం నీటిపై తేలడాన్ని గమనించి.. వెంటనే మునిసిపల్‌ ప్రత్యేక అధికారి దిలీప్‌కు ఫోన్‌ చేశారు. కళేబరాన్ని తొలగించి నీళ్లల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపేందుకు సిబ్బందిని పంపాలని కోరగా ఆయన వద్ద నుంచి సానుకూల సమాధానం రాకపోవడంతో స్వయంగా ఆమె నడుముకి తాడు కట్టుకుని మాజీ సర్పంచ్‌ సంతోష్‌ సహకారంతో సుమారు 42 అడుగుల లోతుగల బావిలోకి దిగి నక్క కళేబరాన్ని బయటకు తీసింది. దీంతో గ్రామస్తులంతా సుమను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల తీరుపపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top