స్మార్ట్‌ కోరల్లో చిక్కి..

Women crime special story - Sakshi

జీవితాలు పాడుచేసుకుంటున్న టీనేజర్లు

సెల్‌ఫోన్‌ ఎడిక్షన్‌పై సర్వత్రా ఆందోళన

నేరాలకు పురిగొల్పుతున్న ఇంటర్‌నెట్‌

తలెత్తుకోలేకపోతున్న తల్లిదండ్రులు 

దేశ భవిష్యత్తుకే ప్రమాదం: నిపుణులు   

నగర శివారులోని ఓ సంక్షేమ గృహంలో ఉండే బాలిక నీలిచిత్రాలు చూస్తుండగా వార్డెన్‌ పట్టుకున్నాడు. అప్పటి నుంచి అందరికీ చెబుతానని బెదిరించి బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం పదిమందికీ తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుల సలహా మేరకు వారు మరో ఊరుకు మకాం మార్చారు.

ఎనిమిదో తరగతి చదువుతున్నఓ బాలుడు మాదాపూర్‌లో ఓ లేడీస్‌ హాస్టల్‌లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. అతని ట్యాబ్‌లో ఏకంగా 3,000 వీడియోలు దొరికాయి. ఇదంతా ఎలా తీశావంటే.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని చెబితే విస్తుపోవడం పోలీసుల వంతైంది.

50 ఏళ్లున్న ఓ పెద్దమనిషి ఫేస్‌బుక్‌లో ఓ బాలికను మాయమాటలతో మభ్యపెట్టి, ఆమె నగ్నచిత్రాలు తస్కరించి వేధించడం ప్రారంభించాడు. విషయం సైబర్‌ పోలీసుల దాకా వెళ్లడంతో బాలిక అపాయం నుంచి బయటపడింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరం.. ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పిల్లలు, స్కూలు, ఇల్లు, ఉద్యోగాలు అంటూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మినీ యుద్ధమే చేస్తారు. ఈ క్రమంలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అన్న విషయాలపై శ్రద్ధ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. ఇంట్లో ఇంటర్నెట్, ట్యాబ్, స్మార్ట్‌ ఫోన్‌ వదిలి వెళ్తున్నాం, మా పిల్లలెలా ఉన్నారో వీడియో కాల్‌ ద్వారా చూసి ఆనందపడుతున్నాం అనుకుంటున్నారు కానీ.. వారు గాడ్జెట్లతో ఏం చేస్తున్నారన్నది పోలీస్‌స్టేషన్‌ నుంచి పిలుపొచ్చే దాకా తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఇలాంటి ఘటనలు వారిని తలెత్తుకోనీకుండా చేస్తున్నాయి. 

భవిష్యత్తును నాశనం చేస్తున్న ఫోన్లు..
మొన్నటిదాకా బ్లూవేల్‌ గేమ్‌ల పేరుతో ప్రాణాలు తీసుకున్న పిల్లలు, ఇపుడు పబ్జీ గేమ్‌ల పేరుతో 24 గంటలూ గ్రూపులుగా గేమ్‌లోనే మునిగిపోతున్నారు. ఓవైపు సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నా.. ఎవరిలోనూ ఎలాంటి ఆందోళనా లేదు. అర్ధరాత్రి ఒంటిగంట లేదా తెల్లవారుజామున 4 గంటల దాకా గ్రూపులుగా ఉండి మరీ ఈ వీడియో గేములు ఆడుతున్నారు. తీరా రిజల్ట్‌ వచ్చేసరికి బ్యాక్‌లాగ్స్‌తో తెల్లమొహాలు వేస్తున్నారు. ఇంటర్‌లో 90 శాతం తెచ్చుకున్న విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీకి వచ్చేసరికి బండెడు బ్యాక్‌లాగ్స్‌ పెట్టుకోవడం తల్లిదండ్రులను, పాఠాలు చెప్పే గురువులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మొత్తానికి స్మార్ట్‌ఫోన్‌ ఎడిక్షన్‌లో కూరుకుపోయిన పిల్లలు తమ తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

స్మార్ట్‌ ఎడిక్షన్‌ లక్షణాలు..

►ఇది టీనేజీ పిల్లల్లో అధికం. స్మార్ట్‌ఫోన్‌ లేకుండా క్షణం ఉండరు
తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తరగతి గదిలో, చివరికి బాత్‌రూంలోనూ ఇది లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటారు
►డిప్రెషన్‌కు లోనవడం, చీటికీమాటికీ చిరాకుపడటం
►అశ్లీల సాహిత్యం, వీడియోలకు బానిసవడం, ఇంటర్‌నెట్‌ లేకపోతే మౌనంగా కూర్చోవడం, ఎవరితోనూ కలవలేకపోవడం
► మిత్రులపై గాసిప్స్‌ క్రియేట్‌ చేయడం, వాటిని షేర్‌ చేయడం
►ఏకాంతంగా ఉండటం, చదువుపై శ్రద్ధ చూపకపోవడం
►   పదేపదే అద్దంలో చూసుకోవడం, తమలో తామే నవ్వుకోవడం, బాధపడటం. అందంగా ఉన్నవాళ్లతో తమను పోల్చి చూసుకోవడం
►  నిత్యం కొత్తదనం కోసం తపించడం, హింసాత్మక గేమ్‌లు ఆడటం

ఇది నిశ్శబ్ద ప్రమాదం: ఎండ్‌ నౌ ఫౌండేషన్‌
స్మార్ట్‌ఫోన్‌ దుర్వినియోగం ఇప్పుడు ఒక వ్యసనంగా మారింది. దీనిపై స్పందించకుంటే భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ‘ఎండ్‌ నౌ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అనిల్‌ రాచమల్ల. లేత వయసులో ఇలాంటి ఘటనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సమాజంలో వారిని తలెత్తుకోనీయకుండా చేయడంతో బాగా కుంగిపోతారు. కానీ, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే వారి తరువాత ఇలాంటి ఘటనల్లో రెండో బాధితులు తల్లిదండ్రులే. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ విషసంస్కృతిపై అందరం పోరాడాలి. ఇలాగే వదిలేస్తే ఇది దేశ భవిష్యత్‌ని కబళిస్తుంది. అందుకే ఆన్‌లైన్‌ భద్రత, సైబర్‌ సమస్యలు, సోషల్‌ మీడియా దుష్ప్రభావాలు, స్మార్ట్‌ఫోన్‌ను ఎంతవరకు వినియోగించాలి? వాటి దుష్ప్రభావాలపై విద్యార్థులకు కౌన్సెలింగ్, పోలీసులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైన పిల్లలకు మేం కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. వాటివల్ల సమాజంలో బంధాలు, బాంధవ్యాలు ఎలా నాశనమవుతాయో, వారి కెరీర్‌ ఎలా విచ్ఛిన్నమవుతుందో వివరిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా సంస్థ సైనికులు కూడా విద్యార్థులే కావడం విశేషం. మాతోపాటు సంస్థలో జస్టిస్‌ ఈశ్వరయ్య, విశ్రాంత ఐపీఎస్‌ కాశీనాథ్‌ బత్తిన, డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు భాగస్వాములుగా ఉన్నారు.

ఎలా అరికట్టాలి..?
►వీటిని నివారించాలంటే.. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కేసుల స్వీకరణకు పోలీసులు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి
► విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించాలి
► యువత, టీనేజర్లకు చైనా తరహాలో ‘స్మార్ట్‌ డీ–ఎడిక్షన్‌’ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందించాలి
►   ఆన్‌లైన్‌ వేధింపులకు శిక్షలు కఠినతరం చేయాలి
►   ప్రమాదకరంగా మారిన
గేమింగ్‌ సైట్లను ఎప్పటికపుడు గుర్తించి నిషేధించాలి
►   అశ్లీలం, హింసను ప్రేరేపించే సైట్లపై పర్యవేక్షణ ఉంచాలి
►చిన్నారులపై ఆన్‌లైన్‌ ద్వారా వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top