ఆత్మరక్షణకు గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి

A Woman Requested To The City Police Commissioner For Licensed Gun - Sakshi

నగర పోలీస్‌ కమిషనర్‌కు ఓ అధ్యాపకురాలి విజ్ఞప్తి

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విజ్ఞాపన పత్రం

హన్మకొండ చౌరస్తా: ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం గన్‌ లైసెన్స్‌ మంజూరు చేయాలని ఓ అధ్యాపకురాలు పోలీసులకు అర్జీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా నంటూ.. తన పేరు నౌషీన్‌ ఫాతిమాగా కమిషనర్‌కు ఇచ్చిన అర్జీలో ఆమె పేర్కొంది. కేవలం ఈ–మెయిల్‌ ఐడీని మాత్రమే పేర్కొన్న నౌషీన్‌ ఫాతిమా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఉద్యోగరీత్యా నిత్యం ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణిస్తానని, తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది.

ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తన ఇల్లు ఉందని, నిత్యం అదే మార్గంలో వెళ్తానంటూ తెలిపింది. ప్రియాంకారెడ్డి, మానసపై జరిగిన అఘాయిత్యాలు ఇతర మహిళలపైనా జరగొచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్‌ చేసినా, మొబైల్‌ యాప్‌ ద్వారా తక్షణ సహాయం కోరినా పోలీసులు రక్షిస్తారన్న నమ్మకం లేదని దరఖాస్తులో పేర్కొంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్‌ కలిగి ఉండటమే సురక్షిత మార్గమని నమ్ముతున్నట్లు వివరించింది.

‘అతడిని శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు’ 
సాక్షి, హైదరాబాద్‌: హాజీపూర్‌ వరుస హత్యల నిందితుడిని కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంకారెడ్డి, మానస హత్యలు జరిగేవి కావని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మహిళలు, బాలికల హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇకనైనా మద్య నిషేధం అమలు చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top