ప్రాధాన్యతలిస్తే పరిశీలిస్తాం..

Welfare Departments That Make Proposals In Order Of Priority - Sakshi

బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతల నేపథ్యంలో అదనపు ప్రపోజల్స్‌ కోరిన ప్రభుత్వం

ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొందిస్తున్న సంక్షేమ శాఖలు

హాస్టళ్ల డైట్‌ చార్జీలు, గురుకులాల నిర్వహణకు సంతృప్తికరంగా నిధులు

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం కోత పెట్టిన నేపథ్యంలో శాఖల వారీగా ప్రాధాన్యతలకు అదనపు నిధులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించిన అధికారులు.. తాజాగా అత్యవసర కేటగిరీలో ఉన్న కార్యక్రమాలను పూర్తిచేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు స్వీకరించే పనిలో పడ్డారు. ఈ మేరకు సంక్షేమ శాఖలకున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సంక్షేమ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలు చేసింది.

డైట్‌కు.. రైట్‌ రైట్‌..
సంక్షేమ శాఖల పరిధిలో అత్యవసర కేటగిరీలో వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్లను చేర్చారు. వీటిల్లో డైట్‌ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పడటంతో డైట్‌ చార్జీల చెల్లింపులకు ఇబ్బందులు రాకుంగా జాగ్రత్త వహించాలని ఆయా శాఖలకు సూచనలు చేసింది. ఈ క్రమంలో డైట్‌ చెల్లింపుల్లో జాప్యం జరగకుండా వీటిని అవసరమైనంత త్వరితంగా పరిష్కరిస్తామని, నిధుల అవసరాలను ఎప్పటికప్పుడు వివరించాలని ఆదేశించింది. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో నిర్వహణను కూడా ప్రాధాన్యత కేటగిరీలో చేర్చింది.

తాజా బడ్జెట్‌లో గురుకుల సొసైటీలకు గతేడాది కంటే కేటాయింపులు తక్కువగా జరిగాయి. అయినప్పటికీ వీటి నిర్వహణకు సంబంధించి నిధులను గ్రీన్‌చానల్‌ పద్ధతిలో ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సుముఖత తెలిపింది. విద్యార్థుల ఉపకారవేతనాలకు కూడా ఇబ్బందులు లేకుండా సంక్షేమ శాఖల వారీగా అంచనాలను పంపితే త్రైమాసిక నిధుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. సంక్షేమ శాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

అయితే స్వయం ఉపాధి పథకాలు, రాయితీ పథకాలకు సంబం ధించి ఈ ఏడాది కేటాయింపులు లేవని స్పష్టమవుతోంది. అదేవిధంగా సివిల్‌ వర్క్స్‌కు కూడా ఈ వార్షికంలో అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ కేటగిరీల్లో ఎలాంటి ప్రతిపాదనలు పంపడం లేదని తెలుస్తోంది. ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొం దించి వారంలోగా ప్రభుత్వానికి సమర్పిస్తే వాటిని పరిశీలించి ఆమోదిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top