బిల్‌గేట్స్‌తో బాబు భేటీ | WEF 2015: Chandrababu Naidu bumps into old friend Bill Gates at Davos | Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌తో బాబు భేటీ

Jan 24 2015 2:43 AM | Updated on Sep 2 2017 8:08 PM

బిల్‌గేట్స్‌తో బాబు భేటీ

బిల్‌గేట్స్‌తో బాబు భేటీ

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు.

 పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు
సాక్షి, హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును చూసి బిల్‌గేట్స్ ఉద్వేగానికి లోనయ్యారని, సీఎం పదవిని చేపట్టడంపై బాబును గేట్స్ అభినందించారని హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనలో పేర్కొన్న వివరాల మేరకు.. సీఎం చంద్రబాబు దావోస్ వచ్చారన్న సమాచారంతో గేట్స్ గురువారం రాత్రే బాబుతో భేటీకి యత్నించారు. అప్పటికే సీఎం నిద్రకు ఉపక్రమించడంతో గేట్స్ శుక్రవారం ఉదయం బాబుతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల భేటీ సందర్భంగా పదేళ్ల క్రితం విషయాలను గుర్తు చేసుకున్నారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్ అంశాల్లో సహకరించాలని సీఎం కోరగా.. గేట్స్ పరిశీలిస్తానన్నారు. అనంతరం బాబు గౌరవార్ధం గేట్స్ విందు ఇచ్చారు.
 
పెట్టుబడులే లక్ష్యం..
ఐటీలో రూ.12 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గేట్స్‌కు సీఎం తెలిపారు. విశాఖ, తిరుపతి నుంచి అనంతపురం వరకూ 2 ఐటీఐఆర్‌లు, రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీ హబ్‌లు, 20 ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు నెలకొల్పేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టు వివరించారు. విశాఖపట్నంలో ఇప్పటికే కేంద్ర పరిశోధనా సంస్థ సమీర్‌కు 13 ఎకరాలు కేటాయించామని, చిత్తూరులో శ్రీసిటీ ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ నెలకొల్పుతున్నట్టు సీఎం తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని గేట్స్‌ను కోరారు. కాగా, ఏపీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని గేట్స్ హామీ ఇచ్చారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కూడా సీఎం భేటీ అయ్యారు. తెలుగువాడైన సత్య మైక్రోసాఫ్ట్‌కు సీఈవో కావడం గ ర్వకారణమని బాబు అన్నారు.
 
పారిశ్రామికవేత్తలతో భేటీ
దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గూగుల్ సీఈవో ఎరిక్‌స్మిత్‌తో సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. ఏపీలో డిజిటల్ లిటరసీకి సహకరిస్తానని ఎరిక్‌స్మిత్ హామీనిచ్చారు. అదేవిధంగా హీరో మోటార్ కార్ప్ అధినేతలు పవన్ ముంజాల్, సునీత్ కాంత్ ముంజాల్‌ల ఆహ్వానం మేరకు గురువారం రాత్రి ఆ సంస్థ ఫెసిలిటీ సెంటర్‌కు వెళ్లి విందులో పాల్గొన్నారు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోరియా, వెల్‌సన్ గ్రూప్‌కు చెందిన బి. గోయంకా, భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్, జీఈ వైస్ చైర్మన్ జాన్‌రైస్‌లతో కూడా సీఎం భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. శుక్రవారంతో పర్యటన ముగిసినప్పటికీ మరోరోజు అక్కడే ఉండి మరింత మంది ప్రముఖులను కలవాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఆయన ఆదివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారు. అప్పటి వరకు ఆయన వెంట ఎంపీ సీఎం రమేష్, ఉన్నతాధికారులు అజయ్‌జైన్, ఎస్.ఎస్.రావత్‌లు దావోస్‌లోనే ఉంటారు. కాగా, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మిగిలిన వారు శుక్రవారం రాత్రికి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
 
ఇదిలావుంటే, దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు విశాఖ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళతారు. అనంతరం విజయవాడ చేరుకుని సోమవారం ఉదయం అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. దావోస్‌లో అమెరికా వాణిజ్య మంత్రి పెన్నీ ఫిజ్జికర్, జిందాల్ గ్రూప్ చైర్మన్ జిందాల్‌లతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా, శుక్రవారం బాబు కుమారుడు లోకేశ్ పుట్టినరోజు కావడంతో దావోస్‌లో కేక్ కట్‌చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement