ఐటీ కారిడార్‌కు జలహో

Water Pipeline in Lingampalli to Hitech City Hyderabad - Sakshi

ముత్తంగి జంక్షన్‌ నుంచి కోకాపేట వరకు భారీ నీటి పైపులైన్‌

రూ.285 కోట్లతో చేపట్టనున్న పనులు..

త్వరలో పరిపాలన అనుమతులు..

2 నెలల్లో పనులు పూర్తి  

సాక్షి, సిటీబ్యూరో: రాబోయే వేసవిలో ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు లింగంపల్లి నుంచి రివర్స్‌ పంపింగ్‌ విధానంలో నీటి సరఫరా జరుగుతుండటంతో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు భారీ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ఏర్పాటు చేయాలని జలమండలి సంకల్పించింది. గతంలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో ఘన్‌పూర్‌ భారీ స్టోరేజ్‌ రిజర్వాయర్‌ నుంచి.. ముత్తంగి జంక్షన్‌ వరకు భారీ పైపులైన్‌ ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా.. ముత్తంగి జంక్షన్‌ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట వరకు భారీ రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.285 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేపట్టనున్న పనులకు సంబంధించి.. త్వరలో మున్సిపల్‌ శాఖ పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయడం ద్వారా గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, కోకాపేట్, నల్లగండ్ల,  కొల్లూరు తదితర ప్రాంతాలకు తాగునీటి కష్టాలు సమూలంగా తీరనున్నాయి. ఈ పనుల పూర్తితో గ్రేటర్‌కు మణిహారంలా.. 158 కిలో మీటర్ల మేర విస్తరించిన ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ముందడుగు పడనుండటం విశేషం.  

వాటర్‌ గ్రిడ్‌తో.. దాహార్తి దూరం..
మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీతో పాటు.. ఔటర్‌రింగ్‌ రోడ్డుకు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్‌ మెయిన్‌ పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటు కానున్న టౌన్‌షిప్‌లు, కాలనీలకు నిరంతరాయంగా 24 గంటలపాటు కొరత లేకుండా తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తికీ తలసరి నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్‌ పర్‌ క్యాపిటా డైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటర్‌గ్రిడ్‌ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది.  

ఏడు చోట్ల వాటర్‌ గ్రిడ్‌ జంక్షన్లు..
ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాల నీటిని వాటర్‌గ్రిడ్‌ రింగ్‌మెయిన్‌ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 7 చోట్ల  గ్రిడ్‌ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు.  పటాన్‌చెరు వద్ద ఏర్పాటుచేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌ పైపులైన్‌కు అనుసంధానించనున్నారు. ఇక శామీర్‌పేట్‌ వద్ద కేశవాపూర్‌ భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్‌ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నీటిని కిస్మత్‌పూర్‌ వద్ద, బొంగ్లూరు జంక్షన్‌ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మ నాగారం (చౌటుప్పల్‌) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ జంక్షన్‌ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్‌ గ్యాలన్ల శుద్ధిచేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపల ఏమూలకైనా తరలించే అవకాశం ఉంది. వాటర్‌గ్రిడ్‌ కాన్సెప్ట్‌ అమెరికా, బ్రిటన్‌ దేశాల్లోని పలు మహానగరాల్లో అమల్లో ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top