గోదాము కిరాయి ఇవ్వడం లేదని..

Warehousing owner Sells books worth Rs.3 crore Illigally - Sakshi

తాళం పగలగొట్టి రూ.3 కోట్ల విలువైన పుస్తకాలు అమ్మేసిన యజమాని 

బాధితుని ఫిర్యాదుతో ముగ్గురి అరెస్ట్‌ 

ఐదు లారీల పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 

హైదరాబాద్‌: గోదాము కిరాయి ఇవ్వడం లేదని రూ.3 కోట్ల విలువైన పుస్తకాలను అమ్మేశాడు దాని యజమాని. బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్‌ చేసిన రాచ కొండ ఎస్‌వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీస్‌లు 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. గాంధీనగర్‌కు చెందిన నికేతన్‌ దేవడిగ కాప్రా వంపుగూడ వద్ద గోదామును కిరాయికి తీసుకుని పుస్తకాలు ముద్రిస్తుంటాడు.

తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌కు భారత చరిత్ర, పర్యావరణ శాస్త్రం, అట్లాస్‌ ఆఫ్‌ మై వరల్డ్, సైన్స్, పిల్లలు, లైబ్రరీలకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటా డు. గోదాము యజమాని నర్సింహారెడ్డికి నెలకు రూ.50 వేలు కిరాయి చెల్లించాలి. నికేతన్‌ ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంతకాలంగా కిరాయి చెల్లించకపోవడంతో లక్షల్లో బకాయిపడ్డాడు. అయితే నికేతన్‌ కిరాయి చెల్లించే స్థితిలో లేడని భావించిన నర్సింహారెడ్డి, అతని కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కలసి ఈ నెల 4న గోదాము తాళం పగలగొట్టి రూ.3.24 కోట్ల విలువైన 10 ట్రక్కుల పుస్తకాలను బేగంపేటలోని ఎంఆర్‌ బుక్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఎండీ రజీముద్దీన్‌కు రూ.15లక్షలకు అమ్మేశారు.

రజీముద్దీన్‌ ముంబై సీఎస్‌టీ దగ్గరున్న ఆదినాథ్‌ బుక్‌ సేల్స్‌ ధమ్‌జీకి రూ.22 లక్షలకు అమ్మాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ ఎస్‌వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రజీముద్దీన్‌ను అరెస్ట్‌ చేసి ముంబై నుంచి 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో పుస్తకాలు కొనుగోలు చేసిన ధమ్‌జీపై కేసు నమోదు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top