కాంగ్రెస్ పార్టీకి వెంకటస్వామి రాజీనామా | venkata swamy resigned from the Congress in the Constitution | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీకి వెంకటస్వామి రాజీనామా

Apr 12 2014 11:37 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

చేవెళ్ల, న్యూస్‌లైన్: కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకున్న కల రెండు దఫాలుగా నెరవేరకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ రాజీనామా పత్రాన్ని శనివారం ఫ్యాక్స్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు పంపించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, అన్యాయానికి మనస్తాపం చెంది తాను ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
 
2009, 2014లో రెండుసార్లు కూడా అసెంబ్లీకి పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. 1995లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి త్రుటిలో చేజారిందని, కాంగ్రెస్‌లోనూ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ చివరి క్షణాల్లో చేజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అర్థరహితమని భావించి పార్టీకి రాజీనామా చేశానన్నారు. ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరబోనని చెప్పారు.
 
 నమ్మినవాళ్లే నా వెంటరావడంలేదు
 కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా తనను ఇండిపెండెంట్‌గా పోటీ చేయమని నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు తెచ్చిన ఒత్తిడి మేరకే నామినేషన్ వేశానని వెంకటస్వామి పేర్కొన్నారు. ఇప్పుడు వారే తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారని, ఒక్కొక్కరుగా దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోటీలో ఉండి ప్రయోజనం లేదని భావించి నామినేషన్ ఉపసంహరించుకున్నానని తెలిపారు. తాను నమ్మినవారే నట్టేటా ముంచారని, ఇంకా రాజకీయాలలో కొనసాగడం ఎవరిని ఉద్ధరించడానికని ప్రశ్నించారు.
 
 కన్నీటి పర్యంతమైన వెంకటస్వామి
1978నుంచి 83 వరకు లోక్‌దళ్‌లో, 83నుంచి 99వరకు టీడీపీలో, 1999నుంచి 2014 వరకు కాంగ్రెస్‌లో నిమబద్ధతగల కార్యకర్తగా పనిచేసినా తాను ఏ పదవీ పొందలేకపోయానని, ఏ పార్టీ తనకు న్యాయం చేయలేదని పేర్కొంటూ వెంకటస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. మూడున్నర దశాబ్దాల ప్రజాసేవ, రాజకీయ జీవితం పరులకే ఉపయోగపడిందేకాని తనకు ఒరిగిందేమీలేదని వెక్కివెక్కిఏడ్చారు. ఆయన బాధను చూడలేక అక్కడే ఉన్న మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పి.ప్రభాకర్ కూడా కన్నీరుపెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement