Padala Venkata Swamy
-
పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలి
చేవెళ్ల: ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలోకి మారడం నైతిక విలువలులేని రాజకీయాలకు నిదర్శనమని, అనుభవిస్తున్న పదవులకు రాజీనామాలు చేసి పార్టీలు మారితే బాగుంటుందని జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో శనివారం మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, న్యాలట మాజీ సర్పంచ్ పి.బాలయ్య తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. ఒకపార్టీ గుర్తుపై గెలిచి తమ స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తూ పార్టీలు మారడం తగదన్నారు. కాంగ్రెస్‌నుంచి గెలిచి శుక్రవారం టీఆర్ఎస్లో చేరిన మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్తోపాటు ఇటీవల పార్టీ మారిన నాయకులంతా పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. పార్టీలు మారే సాంప్రదాయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులే ప్రోత్సహించడం సబబు కాదన్నారు. ఆరు నెలల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనందునా రానున్న రోజులు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తంచేశారు. -
కాంగ్రెస్ గెలుపోటములపై సమీక్ష
చేవెళ్ల: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములపై సమీక్షా సమావేశం ఆగస్టు ఒకటిన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మాదిరిగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గాంధీభవన్‌లో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపోటములకు కారణాలను విశ్లేషించడంతోపాటు భవిష్యత్‌లో పార్టీ పటిష్టత, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 10.30 నుంచి 10.45 నిమిషాలకు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్, 10.45 నుంచి 11.30 వరకు రాజేంద్రనగర్, 11.30 నుంచి 12.15 వరకు శేరిలింగంపల్లి, 12.15 నుంచి 1.00 గంటల వరకు చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షలు జరుగుతాయని తెలిపారు. ఒంటి గంట నుంచి 1.30వరకు భోజన విరామం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు 3 గంటల వరకు వికారాబాద్, 3 గంటల నుంచి 3.45 వరకు తాండూరు, 3.45 నుంచి 4.30 వరకు భువనగిరి పార్లమెంట్ నియోకజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ సమీక్ష జరుగుతుందన్నారు. ఈ సమీక్షలకు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పోటీచేసి ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, జిల్లా డీసీసీ కార్యవర్గసభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు హాజరు కావాలని ఆయన సూచించారు. -
కాంగ్రెస్ పార్టీకి వెంకటస్వామి రాజీనామా
చేవెళ్ల, న్యూస్‌లైన్: కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పడాల వెంకటస్వామి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలనుకున్న కల రెండు దఫాలుగా నెరవేరకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామా పత్రాన్ని శనివారం ఫ్యాక్స్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు పంపించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి, అన్యాయానికి మనస్తాపం చెంది తాను ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 2009, 2014లో రెండుసార్లు కూడా అసెంబ్లీకి పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. 1995లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి త్రుటిలో చేజారిందని, కాంగ్రెస్‌లోనూ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ చివరి క్షణాల్లో చేజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అర్థరహితమని భావించి పార్టీకి రాజీనామా చేశానన్నారు. ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరబోనని చెప్పారు. నమ్మినవాళ్లే నా వెంటరావడంలేదు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా తనను ఇండిపెండెంట్‌గా పోటీ చేయమని నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు తెచ్చిన ఒత్తిడి మేరకే నామినేషన్ వేశానని వెంకటస్వామి పేర్కొన్నారు. ఇప్పుడు వారే తనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారని, ఒక్కొక్కరుగా దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోటీలో ఉండి ప్రయోజనం లేదని భావించి నామినేషన్ ఉపసంహరించుకున్నానని తెలిపారు. తాను నమ్మినవారే నట్టేటా ముంచారని, ఇంకా రాజకీయాలలో కొనసాగడం ఎవరిని ఉద్ధరించడానికని ప్రశ్నించారు. కన్నీటి పర్యంతమైన వెంకటస్వామి 1978నుంచి 83 వరకు లోక్‌దళ్‌లో, 83నుంచి 99వరకు టీడీపీలో, 1999నుంచి 2014 వరకు కాంగ్రెస్‌లో నిమబద్ధతగల కార్యకర్తగా పనిచేసినా తాను ఏ పదవీ పొందలేకపోయానని, ఏ పార్టీ తనకు న్యాయం చేయలేదని పేర్కొంటూ వెంకటస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. మూడున్నర దశాబ్దాల ప్రజాసేవ, రాజకీయ జీవితం పరులకే ఉపయోగపడిందేకాని తనకు ఒరిగిందేమీలేదని వెక్కివెక్కిఏడ్చారు. ఆయన బాధను చూడలేక అక్కడే ఉన్న మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పి.ప్రభాకర్ కూడా కన్నీరుపెట్టుకున్నారు.


