ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములపై సమీక్షా సమావేశం ఆగస్టు ఒకటిన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి పేర్కొన్నారు.
చేవెళ్ల: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములపై సమీక్షా సమావేశం ఆగస్టు ఒకటిన నిర్వహించనున్నట్లు జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి పేర్కొన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల మాదిరిగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గాంధీభవన్‌లో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపోటములకు కారణాలను విశ్లేషించడంతోపాటు భవిష్యత్‌లో పార్టీ పటిష్టత, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 10.30 నుంచి 10.45 నిమిషాలకు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్, 10.45 నుంచి 11.30 వరకు రాజేంద్రనగర్, 11.30 నుంచి 12.15 వరకు శేరిలింగంపల్లి, 12.15 నుంచి 1.00 గంటల వరకు చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షలు జరుగుతాయని తెలిపారు. ఒంటి గంట నుంచి 1.30వరకు భోజన విరామం ఉంటుందన్నారు.
మధ్యాహ్నం 2.15 నిమిషాలకు 3 గంటల వరకు వికారాబాద్, 3 గంటల నుంచి 3.45 వరకు తాండూరు, 3.45 నుంచి 4.30 వరకు భువనగిరి పార్లమెంట్ నియోకజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ సమీక్ష జరుగుతుందన్నారు. ఈ సమీక్షలకు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పోటీచేసి ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, జిల్లా డీసీసీ కార్యవర్గసభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు హాజరు కావాలని ఆయన సూచించారు.


