కాలుష్యానికి చెక్‌

Urban Parks in Hyderabad - Sakshi

గ్రేటర్‌ పరిధిలో అర్బన్‌ పార్కుల ఏర్పాటు

రంగారెడ్డి జిల్లా పరిధిలో 26, మేడ్చల్‌ పరిధిలో 11 బ్లాక్‌లు  

ఇప్పటికే పలు చోట్ల ప్రజలకు అందుబాటులోకి  

నవంబర్‌లోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక  

సాక్షి సిటీబ్యూరో: నగరంలో నానాటికి పెరిగిపోతున్న  ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యం భారి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ వారికి మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు  ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో పాటు శివారు ప్రాంతాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని అందిచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేయనుంది. పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని ‘అర్బన్‌ లంగ్‌ స్పేస్‌లు’గా అభివృద్ధి చేస్తున్నారు.  నగరం నలువైపులా ఈ తరహా పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల, వెలుపల మొత్తం 14 ప్రాంతాలను అర్బన్‌ పార్కులుగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే పలు చోట్ల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆయా అర్బన్‌ పార్క్‌లను  పలు బ్లాక్‌లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. 

ఆహ్లాదం..ఉత్సాహం..
 గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్, దూలపల్లి, గాజుల రామారం తదితుర ప్రాంతాల్లోని అటవీ బ్లాక్‌లలో పార్కుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ఇందుకుగాను 3345 హెక్టార్ల అటవీ భూమిని గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేయనున్నారు. నిత్యం ట్రాఫిక్, కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన బిజీ లైఫ్‌ లో ఉదయమో, సాయంత్రం వేళ్లో్ల వాకింగ్, కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా కాసేపు గడిపేందుకు, పెద్దలకు వాకింగ్‌ ట్రాక్, యోగా ప్లేస్‌ లతో పాటు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి పిక్నిక్‌ కు వెళ్లినా, అన్ని సౌకర్యాలు ఉండేలా ఈ పార్క్‌లను తీర్చిదిద్దుతున్నారు 

ఎకో టూరిజానికి అవకాశాలు...  
గుర్రంగూడ సంజీవని పార్క్, అజీజ్‌ నగర్‌ సమీపంలోని మృగవని నేషనల్‌ పార్క్, కండ్లకోయ నేచర్‌ పార్క్, శంషాబాద్‌ సమీపంలో డోమ్‌ నేర్‌ పార్క్, ఘట్‌ కేసర్‌ సమీపంలోని భాగ్యనగర్‌ సందనవనం పార్క్, హయత్‌నగర్‌లోని మహవీర్‌ హరిణ వనస్థలి, కుంట్లూర్, మన్సురాబాద్, కుత్బుల్లాపూర్‌ బ్లాక్‌లు, గండిగూడ పార్కులు  ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న కాలనీలు, పట్టణ ప్రాంతానికి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ పార్కుల అభివృద్ధి చేయడంతో సందర్శకుల సం ఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో కొన్ని పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పా టు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి. ప్రకృతి మధ్యలో అటవీ ప్రాంతాల్లో ఒకటి రెండు రోజులు గడపటంతో పాటు పచ్చటి వాతావరణంలో సేదతీరాలని భావించే వారికి ఇవి చక్కటి అవకాశంగా మారాయి.

ఒక్కో పార్క్‌ ఒక్కో థీమ్‌....
ఒక్కో పార్క్‌ ను ఒక్కో థీమ్‌ తో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 అర్బన్‌ పార్క్‌ల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్న అటవీ శాఖ. అన్ని పట్టణ ప్రాంతాలు, ఆవాసాలకు వీలైనంత సమీపంలో ఈ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ లను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అటవీ శాఖ పనిచేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 26 బ్లాక్‌లను గుర్తించగా వీటిలో 7 అటవీశాఖ, 9 హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ 2, టీఎస్‌ఐఐసీ 5, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ 2, టీఎస్‌ఎఫ్‌డీసీ 1 బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అన్ని అర్బన్‌ పార్కులు, బ్లాక్‌ల పనులు ఈ ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఇవే కాకుండా మేడ్చల్‌ జిల్లా పరిధిలోను 11 బ్లాక్‌లలో పనులు చేపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top