గ్రేటర్‌కు ‘ప్రాణ వాయువు’! | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌కు ‘ప్రాణ వాయువు’!

Published Wed, May 15 2019 8:28 AM

Urban lung space parks in Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: హైదరాబాద్‌ మహానగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం బహుదూర్‌పల్లి, నాగారం, నారపల్లి ఫారెస్ట్‌ బ్లాకుల్లో మూడు అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ (పార్కులు)ను త్వరలో ప్రారంభించేందుకు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా అటవీ శాఖ సన్నద్ధమవుతున్నది. జిల్లాలో ఇప్పటికే హరితహారంలో భాగంగా నాలుగు ఫారెస్టు బ్లాకులను అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌(పార్కులు)లుగా అభివృద్ధి చేశారు. ఇవి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాలు , నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాలు , నారపల్లి ఫారెస్టు బ్లాకులో 60 ఎకరాల్లో అర్బన్‌ పార్కులు రూపొందిస్తారు. వీటి నిర్మాణంలో భాగంగా ముందుగా ఫారెస్టు బ్లాకు చుట్టూ ఫెన్సింగ్‌(రక్షణ గోడలు), కందకాలు,పైప్‌ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్లాంటేషన్లో కలుపు మొక్కలను ఏరివేయటం, మొక్కల పెరుగుదలను మెరుగుపచ్చటానికి, సౌందర్య రూపాన్ని మెరుగు పర్చటానికి కొమ్మల కత్తిరింపు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తారు. వర్షాకాలంలో సతత హరిత జాతులతో ఇప్పటికీ ఉన్న చెట్లల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒక్కో అర్బన్‌ పార్కు నిర్మాణానికి సంబంధించి రూ.50 లక్షల వరకు జిల్లా అటవీ శాఖ  వెచ్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మూడు పార్కులు నెల రోజుల వ్యవధిలో నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 

ఏడాదిలో మరో ఎనిమిది పార్కులు  
ఈ ఏడాదిలోగా మరో ఎనిమిది అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌లు అందుబాటులోకి తీసురావాలని జిల్లా అటవీశాఖ యోచిస్తున్నది. టీఎస్‌ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో గౌడవెళ్లి, తూముకుంట, లాల్‌గడ్‌ మలక్‌పేట్‌ తదితర ఫారెస్టు బ్లాకుల్లో మూడు అర్బన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. టీఎస్‌ ఐఐసీ నేతృత్వంలో ఎల్లంపేట్‌ ఫారెస్టు బ్లాకులో, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో గాజుల రామారం, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో తుర్కపల్లి, టూరిజం ఆధ్వర్యంలో యాద్గార్‌పల్లి, కీసర, ధర్మారం–ఉప్పరపల్లి ఫారెస్టు బ్లాకుల్లో అర్బన్‌ లంగ్స్‌ పార్కులు నిర్మిస్తున్నారు.  

పర్యావరణానికి దోహదం...
హైదరాబాద్‌ నగర ప్రజలకు ప్రస్తుతం నాలుగు అర్బన్‌ పార్కులు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నాయి. మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం పేరుతో అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాగే కండ్లకోయలోని ఆక్సిజన్‌ పార్కు, నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం పార్కు, దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం పార్కు నగర ప్రజలతోపాటు చిన్నపిల్లలు, టూరిస్టులను అలరిస్తున్నాయి. ఈ అర్బన్‌ పార్కుల్లో ప్రతి రోజు 150 నుంచి 300 మంది ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేస్తుండగా, ఆహ్లాదం, ఆనందం కోసం ప్రతి రోజు 200 నుంచి 500 మంది ప్రజలు వస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వాకర్స్‌ నుంచి నెలకు రూ.150, ఏడాదికి అయితే రూ.1200 నామినల్‌ ఫీజు మెయింటెనెన్స్‌ కింద అటవీ శాఖ వసూలు చేస్తున్నది. 

Advertisement
Advertisement