యూజీసీ ఉండాల్సిందే

UGC Should Be Continue Said By Vice Chancellors - Sakshi

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ అవసరం లేదు

 ఉన్నత విద్యామండలి భేటీలో వీసీలు, మేధావుల అభిప్రాయం

పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం, ఎంపీలు ఒవైసీ, కేకే

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్‌చాన్స్‌లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్‌ వీసీలతో సమావేశం నిర్వహించింది.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 

సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం 
కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్‌ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్‌ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్‌ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top