ఔర్‌ దో దిన్‌..!

Two More Days - Sakshi

ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం

ఎవరి అంచనాల్లో వారు నిమగ్నం

ప్రధానంగా పోలింగ్‌ సరళి పైనే చర్చ

ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 

ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు మునిగిపోగా.. పోలింగ్‌ సరళి ఎవరికి అనుకూలమనే దానిపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని  ఏ నియోజకవర్గంలోనూ మేము గెలుస్తామంటే.. మేము గెలుస్తామని ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ఈవీఎంలను శుక్రవారం అర్ధరాత్రి వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను కొత్తగూడెంలో గల అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో భారీ ఏర్పాట్ల మధ్య ఉంచగా.. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను కొణిజర్ల మండలం తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో ఇక ఆయా పార్టీల అభ్యర్థులు పోలింగ్‌ సరళి, తమ విజయావకాశాలపై ఎవరికి వారే సానుకూల లెక్కలు వేసుకుంటూ.. విజయం ఖాయమన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగు ప్రధాన పక్షాల అభ్యర్థులు పోటీ చేసినా.. ప్రధానంగా టీఆర్‌ఎస్, ప్రజాకూటమి అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అందరికంటే ముందుగా ఓటర్లను కలుసుకుని రెండు నెలలపాటు ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగడానికి.. వారికి టికెట్‌ ఖరారు కావడానికి సమయం పట్టడంతో ఉన్న కొద్ది సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేశారు. దీనికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు దాదాపు 15 రోజులపాటు ప్రచారాన్ని గ్రామాల్లో హోరెత్తించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేసినా.. పోలింగ్‌ సరళి మాత్రం వీరిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది.

 తమ ప్రచారానికి అనుగుణంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతారని భావించిన ప్రధాన రాజకీయ పక్షాలకు, అభ్యర్థులకు అటువంటి పరిస్థితి కనిపించలేదు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ 11 గంటల వరకు మందకొడిగా సాగడంతో తమ విజయావకాశాలపై ఎవరికి వారే తమదైన రీతిలో విశ్లేషణ చేసుకుని పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించారు. దీనికి అనుగుణంగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్‌ శాతం క్రమేణా పెరుగుతూ వచ్చింది. పోలింగ్‌ శాతం పెరగడానికి జిల్లా అధికారులు.. ఎన్నికల సంఘం సారించిన ప్రత్యేక దృష్టి, ఏర్పాట్లు దోహదపడ్డాయి.

 పోలింగ్‌ శాతంపై బేరీజు.. 
ఇక శుక్రవారం జరిగిన పోలింగ్‌ శాతం తమకు ఏ రకంగా ఉపయోగపడుతుందనే అంశంపై ప్రధాన పార్టీలు బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. పట్టణ ప్రాంత ఓటర్లు ఎప్పటిలాగే ఓటు వేయడానికి కొంత అనాసక్తి చూపినా.. గ్రామీణ ప్రాంత ఓటర్లు మాత్రం అత్యధికంగా ఓట్లు వేయడంతో ఆ ఓటింగ్‌ సరళి తమ విజయానికి సంకేతమంటూ టీఆర్‌ఎస్, ప్రజాకూటమి అభ్యర్థులు తమ అనుకూల వాదాన్ని వినిపిస్తున్నారు. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఓటింగ్‌పై మక్కువ చూపడం తమ సంక్షేమ కార్యక్రమాల ఫలితమేనని టీఆర్‌ఎస్‌ నేతలు భాష్యం చెబుతుండగా.. ప్రధాన వర్గాలన్నీ ఓటింగ్‌ వైపు మొగ్గు చూపడం ప్రజా వ్యతిరేకతకు ప్రతిబింబమని ప్రజాకూటమితోపాటు బీజేపీ, సీపీఎం, బీఎల్‌పీ వంటి పార్టీలు ఓటింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఈ రెండు రోజులు తమ సానుకూల, ప్రతికూల అంశాలపై ప్రత్యేక చర్చలు చేసేందుకు ఆయా రాజకీయ పక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

మరోవైపు కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే అంశంపై ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దృష్టి పెట్టాయి. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలో సైతం ఈసారి పోలింగ్‌ శాతం పెరగడం ఇటు అధికారులకు.. అటు రాజకీయ పార్టీలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఓటు హక్కు వినియోగంపై తాము చేసిన ప్రయత్నాలు ఫలించాయని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రజాభీష్టం, ప్రజావ్యతిరేకత వెలువడిందనడానికి పెరిగిన పోలింగ్‌ శాతం తార్కాణమని ప్రధాన రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు జిల్లాల అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేయడం.. ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా టేబుళ్లను, లెక్కింపు సామగ్రిని సిద్ధం చేశారు.

 
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్‌ ఉన్నతాధికారులు తఫ్సీర్‌ ఇక్బాల్, సునీల్‌దత్‌ నేతృత్వంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సరళికి, తమ అంచనాలకు మధ్య గల వ్యత్యాసాన్ని నివృత్తి చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ శ్రేణులతో సమావేశమై.. ఓటింగ్‌ సరళిపై గ్రామాలవారీగా, మండలాలవారీగా సమీక్షలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top