అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

Tupakulagudem project works in slower - Sakshi

నత్తనడకన తుపాకులగూడెం పనులు

ఏడాది గడిచినా అంతంతమాత్రమే పురోగతి  

అటు కాళేశ్వరం పనులు చకచకా

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు అహో.. ఓహో అంటూ అందరూ కితాబిస్తున్నారు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టు అయిన మేడిగడ్డ బ్యారేజీకి 30 కి.మీ.ల దిగువన నిర్మిస్తున్న తుపాకులగూడెం పురోగతిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 10లక్షల ఎకరాలకు సాగునీరందిం చే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

20 ఏళ్ల నుంచి..
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్‌ జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 3 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా పదేళ్ల పాటు శ్రమించి తొలి దశ పనులు ప్రారంభించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఏడాదిలో 171 రోజులు నీటిని ఎత్తిపోయడం ద్వారా 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో డిజైన్‌ చేశారు.

మోటార్ల ద్వారా తోడి పోయాలంటే గోదావరిలో కనీస నీటిమట్టం 71 అడుగులు ఉండాలి. వరదలు వచ్చినప్పుడు తప్ప ఈ స్థాయిలో నీటి మట్టాలు గోదావరిలో లేకపోవడంతో 40 రోజులకు మించి ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్‌ చేయడం సాధ్యపడలేదు. దేవాదుల వద్ద కనీస నీటి మట్టం స్థాయిని ఉంచేలా దిగువన కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిం చేందుకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంకల్పించారు.

ఈ మేరకు పీవీ నర్సింహారావు సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌తో ఇబ్బంది లేకుండా పూర్తిగా ముంపు లేకుండా కంతనపల్లికి 17 కి.మీ.ల ఎగు వన తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. బ్యారేజీ నిర్మాణానికి 2,121 కోట్లు కేటాయించారు.

నత్తనడకన పనులు: కంతనపల్లి రద్దయి తుపాకులగూడెం బ్యారేజీ తెరపైకి రాగా.. గతంలో అగ్రిమెంట్‌ చేసుకున్న సూ–రిత్విక్‌ కంపెనీకే పనులు అప్పగించారు. మారిన పరిస్థితులు, డిజైన్‌కు అనుగుణంగా 2016లో అక్టోబర్‌లో అగ్రిమెంట్‌ కాగా.. 2020 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయా ల్సి ఉంది. 2017 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారం భించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంటే తుపాకులగూడెం పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి.

పనులు ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఫౌండేషన్‌ పనులు పూర్తి కాలేదు. డౌన్‌ స్ట్రీమ్‌ ర్యాఫ్ట్, డౌన్‌ స్ట్రీమ్‌ స్పిల్‌వే పనుల వరకే అయ్యాయి. అవి కూడా నదిలో సగం వరకే పూర్తయ్యాయి. మిగిలిన సగం ప్రాంతంలో అసలు పనులు మొదలు పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే అన్నారం బ్యారేజీకి గేట్లు బిగిస్తుండగా మేడిగడ్డ, సుందిళ్ల వద్ద ఫౌండేషన్‌ పనుల దశ ఎప్పుడో దాటి పోయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top