
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో సంస్థ ఎండీ సునీల్‌శర్మ తీరు చూస్తుంటే ఆయన సీఎం కేసీఆర్‌కు వకాల్తా పుచ్చుకున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నించిందని సునీల్‌శర్మ ఆరోపించడం తగదన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ల కమిటీ, హైకోర్టు సూచనలతో వేసిన మరో కమిటీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకపోగా.. మరింత జఠిలంగా మార్చాయన్నారు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నా ఐఏఎస్ అధికారుల తీరు మారకపోవడం బాధాకరమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని, సర్కార్ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.