దిద్దు'బాట'లో..

TSRTC Hyderabad City Busses Route Changes - Sakshi

ఇక లాభాల రూట్లలోనే సిటీ బస్సులు  

నష్ట నివారణకు ఆర్టీసీ చర్యలు   

ప్రయాణికుల రద్దీ మేరకే రాకపోకలు  

మార్గాల గుర్తింపులో అధికారులు నిమగ్నం  

ప్రయాణికులపై ప్రైవేట్‌ భారం పడే అవకాశం 

సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురుచూస్తున్న బస్సు రాకపోవచ్చు.. ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే! నిజమే... నష్ట నివారణలో భాగంగా ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆదాయానికి అనుగుణంగానే బస్సులు నడుస్తాయి. ఈ మేరకు ఆర్టీసీ భారీ కసరత్తు చేస్తోంది. రూట్ల వారీగా ప్రయాణికుల రద్దీ మేరకే బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం బస్సులు తిరుగుతున్న సుమారు 1,150 రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండేవి? రద్దీ తక్కువగా ఉండేవి? గుర్తించి నడుపుతారు. ఉదాహరణకు ఉదయం మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేవారు తక్కువగా ఉంటే బస్సు రాదు. అదే సమయంలో సికింద్రాబాద్‌ నుంచి మల్కాజిగిరికి వెళ్లేవారు ఎక్కువగా ఉంటే బస్సు వస్తుంది. రూట్ల వారీగా ప్రయాణికుల రాకపోకలు, సమయాన్ని అంచనా వేసి బస్సులు నడపనున్నారు. బస్‌ చార్జీల పెంపు వల్ల కొంత మేరకు ఆదాయం లభించినా, పూర్తిస్థాయిలో నష్టాలను అధిగమించడం సాధ్యం కాకపోవడంతో ఈ తరహా పొదుపును పాటించేందుకు కార్యాచరణ చేపట్టారు. కిలోమీటర్‌కు రూ.16 చొప్పున వస్తున్న నష్టాన్ని బాగా తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ‘కొన్ని రూట్లలో డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. పట్టుమని పది మంది కూడా కనిపించరు. అలాంటప్పుడు బస్సు వేయడం ఎందుకు?’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 

ఇలా ప్రణాళిక...  
ఉదయం 5–6గంటల వరకు నగర శివార్ల నుంచి సిటీలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నడిచే బస్సులను తగ్గిస్తారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఘట్కేసర్, హయత్‌నగర్, నాగారం, పటాన్‌చెరు, చెంగిచెర్ల లాంటి శివారు ప్రాంతాల్లోంచి తెల్లవారుజామున బయలుదేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆర్టీసీ అంచనా.  
అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గుతాయి. అప్పుడు ట్రిప్పుల సంఖ్యను తగ్గిస్తారు.  
రాత్రి 9 తర్వాత కొన్ని రూట్లలో ప్రయాణికులు ఉండడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఉప్పల్‌ నుంచి మెహిదీపట్నం వెళ్లేవారి కంటే మెహిదీపట్నం నుంచి ఉప్పల్‌కు వెళ్లే వారే ఆ సమయంలో ఎక్కువగా ఉంటారు. ఈ మార్పులకు అనుగుణంగా బస్సులు నడుస్తాయి.  
ప్రస్తుతం గ్రేటర్‌లో 3,550 బస్సులు ప్రతిరోజు 42వేల ట్రిప్పులు తిరుగుతుండగా... సుమారు 10వేల ట్రిప్పుల వరకు తగ్గించుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది.   
ఈ మేరకు ఉదయం 4–6గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2గంటల వరకు, రాత్రి 9–11 గంటల వరకు నడిచే బస్సులు తగ్గనున్నాయి. 
42,000ప్రతిరోజుట్రిప్పులు
3,550ప్రస్తుతం నగరంలోనడుస్తున్నబస్సులు
10,000ఆర్టీసీ తగ్గించుకోవాలనిభావిస్తున్నట్రిప్పులు 

ప్రైవేట్‌ దోపిడీకి అవకాశం  
ఆదాయం వచ్చే మార్గాల్లో బస్సులను ఎక్కువగా నడిపి, ఆదాయం లేని మార్గాల్లో తగ్గించుకోవాలనే ఆర్టీసీ వ్యాపార దృక్పథంతో ప్రయాణికులపై ప్రైవేట్‌ భారం పడనుంది. ఆటోలు మరింత అడ్డగోలుగా దోచుకుంటాయి. పీక్‌ అవర్స్‌ పేరిట అధిక చార్జీలు విధిస్తున్న క్యాబ్‌లు... ఆ చార్జీలను మరింత పెంచనున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉంటే చాలు ఏ రాత్రయినా క్షేమంగా ఇంటికి వెళ్లవచ్చుననే భరోసా ఇక ఉండకపోవచ్చు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.  

అక్కడలా.. ఇక్కడిలా  
బెంగళూర్‌లో కోటి 18లక్షల జనాభా ఉంది. ఇక్కడ సుమారు 6,500 బస్సులు ఉన్నాయి. గ్రేటర్‌లోనూ  జనాభా కోటికి చేరింది. కానీ 3,550 బస్సులే ఉన్నాయి. కొత్త బస్సులు కొనే ప్రతిపాదన పక్కన పెట్టి.. ఉన్న బస్సులను, ట్రిప్పులను తగ్గించుకునే చర్యలకు ఆర్టీసీ దిగడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top