వరుస ప్రమాదాలతో భయపెడుతున్న ఆర్టీసీ బస్సు

TSRTC Busses Frightens Travellers By Road Accidents - Sakshi

ఐదేళ్లలో 5వేల ప్రమాదాలు.. 2,304 మంది మృత్యువాత 

డబుల్‌ డ్యూటీలతో డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి 

దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు విశ్రాంతి కరువు 

ఆరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ఖాళీగా 1,800 డ్రైవర్‌ పోస్టులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎర్ర బస్సు అనగానే ఓ అనుబంధం.. ఓ ఆత్మీయత.. అది మన ఇంటి వాహనమన్నంత ప్రేమ.. ఊరికి బస్సు వచ్చిందంటే అదో ఆనందం.. నైట్‌ హాల్ట్‌ చేస్తే, ఆ రాత్రికి డ్రైవర్, కం డక్టర్‌ ఆ ఊరికి అతిథులే.. ఆర్టీసీ బస్సంటే అంత అభిమానం మరి. అందులో ప్రయాణిస్తే హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయేంత నమ్మకం. ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని బస్సుపై ఉన్న నినాదం నిజమేన్న విశ్వాసం. మరి.. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉందా..? ఆర్టీసీ బస్సు ప్రయా ణం సురక్షితమేనా? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. గత ఐదేళ్లలో ఆర్టీసీ ప్రస్థానం చూశాక, ఆ బస్సెక్కాలంటే కొంచెం ఆందోళన చెం దాల్సిన దుస్థితి. కాలక్రమంలో బస్సు నుంచి ఎర్ర రంగు పోయినా.. వరుస ప్రమాదాలతో మన బస్సు మళ్లీ ‘ఎర్ర’బడుతోంది.  

మసకబారుతున్న ప్రతిష్ట... 
దేశంలోనే అతి తక్కువ ప్రమాదాలు నమోదయ్యే రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి పేరుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రతిష్ట మసకబారుతోంది. గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల తీరు చూస్తే ఆందోళన కలుగుతోంది. 2013–14 నుంచి గతేడాది డిసెంబర్‌ వరకు ఏకంగా 5వేల రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సు భాగస్వామ్యమైంది. ఈ ప్రమాదాల్లో 2,304 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం.. నిర్మల్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున రాష్ట్ర సరిహద్దు దాటాక బోల్తాపడింది. అందులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలయ్యారు. గతంలో ఈ సర్వీసు గుంటూరు వరకు ఉండగా, అక్కడికి మరో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు వరకు పొడిగించారు. కానీ డ్రైవర్‌ విశ్రాంతి సమయం మాత్రం పెరగలేదు.

సాధారణంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి గమ్యం చేరిన తర్వాత డ్రైవర్‌కు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండాలి. కానీ అది 6 గంటలకే పరిమితమవుతోంది. ట్రాఫిక్‌ జాంలు, రోడ్లు బాగాలేకపోవటం వంటి కారణాలతో అందులో రెండు గంటల సమయం హరించుకుపోతోంది. దీంతో డ్రైవర్‌కు నికరంగా మిగిలే సమయం నాలుగు గంటలు మాత్రమే. తిరుగు ప్రయాణానికి గంట ముందు సన్నద్ధం కావాల్సి ఉంటున్నందున అది మరీ తగ్గుతోంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు రెండు మూడు గంటలే పడుకుంటున్నారు. గతంలో దూరప్రాంతాలకు వెళ్లొచ్చాక మధ్యలో ఒకరోజు పూర్తి విశ్రాంతి ఉండేది. ఇప్పుడు డ్రైవర్ల కొరత వల్ల అది ఉండటంలేదు. ఒంగోలు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడానికి కారణం.. డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

అనారోగ్యం ఉన్నా డ్యూటీకి... 
రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓ డిపోకు చెందిన డ్రైవర్‌ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణం మధ్యలో కళ్లు తిరుగుతుండటంతో బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. ఓ గంట తర్వాత తేరుకుని బస్సు తీసుకుని డిపోకు వచ్చి, అనారోగ్యంగా ఉన్నందున ఒక్కరోజు సెలవు కావాలని అడిగారు. అయితే, డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉందని డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఒత్తిడి చేయటంతో డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తోటి కార్మికుల ఆందోళనతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అనుమతించారు.

అలాగే వారం రోజుల క్రితం పూర్వపు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్‌ వీక్లీఆఫ్‌ రోజున ఇంటిపట్టునే ఉండి మద్యం తాగారు. కానీ, ఇద్దరు డ్రైవర్లు అనుకోకుండా సెలవు పెట్టడంతో వెంటనే డ్యూటీకి రావాల్సిందిగా డిపో నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. తాను బస్సు నడిపే స్థితిలో లేనన్నా సిబ్బంది వినిపించుకోలేదు. డిపోకు వచ్చిన తర్వాత బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేశాక, అతిగా మద్యం సేవించినట్టు తేలడంతో తప్పనిసరి పరిస్థితిలో తిరిగి పంపించారు. కానీ ఆ లెవల్స్‌ తక్కువగా ఉంటే డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కార్మికులు చెబుతున్నారు. 

ఒత్తిడితో చిత్తు.. 
ప్రస్తుతం ఆర్టీసీ తీవ్రమైన డ్రైవర్ల కొరత ఎదుర్కొంటోంది. ఆరేళ్లుగా నియామకాలు లేకపోవటంతో ప్రస్తుతం 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పదవీ విరమణ చేస్తుండటం, మృత్యువాత పడుతుండటంతో డ్రైవర్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం సంస్థ అవసరాల మేరకు 20,300 డ్రైవర్లు కావాల్సి ఉండగా.. 18,500 మంది మాత్రమే ఉన్నారు. డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో నిత్యం కొన్ని సర్వీసులు డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది.

అసలే ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో కొన్ని సర్వీసులు నిలిపివేయాల్సి రావడం సమస్యను మరింత పెంచుతోంది. దీంతో ఉన్న డ్రైవర్లకు డబుల్‌ డ్యూటీలు వేసి పనిచేయించాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్లు ఒత్తిడికి గురవుతున్నారు. అసలే డ్రైవింగ్‌ సవాల్‌తో కూడుకున్న పని కావడం.. దానికి ఒత్తిడి తోడు కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ డ్రైవర్లు మంచి నైపుణ్యం ఉన్నవారే కావడంతో జాగ్రత్తగానే డ్రైవింగ్‌ చేస్తున్నారు. కానీ, ఎదురుగా వచ్చే వాహనదారుల తప్పిదం, చాలా ప్రాంతాల్లో రోడ్లు ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

శిక్షణ లేని అద్దె బస్సు డ్రైవర్లు... 
సొంత బస్సుల నిర్వహణ భారం నుంచి తప్పించుకునేందుకు కొంతకాలంగా ఆర్టీసీ అద్దె బస్సులను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,800 అద్దె బస్సులున్నాయి. వీటి యజమానులే డ్రైవర్లను నియమిస్తారు. వారు ఆర్టీసీ సొంత డ్రైవర్ల తరహాలో శిక్షణ తీసుకున్నవారు కాదు. ఇది కూడా ప్రమాదాలు పెరిగేందుకు కారణమవుతోంది. గతంలో గోదావరిఖని సమీపంలోని బసంత్‌నగర్‌ వద్ద లోయలో బస్సు పడి ఏడుగురు ప్రాణాలను హరించింది అద్దె బస్సే. ఆ ప్రమాదంలో దాని డ్రైవర్‌ కూడా చనిపోయాడు. బస్సు రోడ్డెక్కితే చాలు అనుకుంటున్న ఆర్టీసీ.. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇప్పించాలన్న విషయాన్ని విస్మరిస్తోంది. ఆటోలు నడిపినవారు కూడా అద్దె బస్సు స్టీరింగ్‌ పట్టుకుని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంతో అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమిస్తున్నారు. దీనిని సంస్థ పట్టించుకోవడంలేదు. 

అక్కడలా.. ఇక్కడిలా.. 
2013 అక్టోబర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెం వద్ద ఓ ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావటంతో 45 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మన రోడ్లకు వోల్వో బస్సు డిజైన్‌ అనుకూలం కాదన్న వాదన రావడంతో ఆ కంపెనీ దిగొచ్చింది. ఉన్నతస్థాయి బృందాన్ని పంపి బస్సును పరిశీలించి, కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో జాతీయ రహదారుల విభాగం అధికారులు సర్వే చేసి దానిని సరిచేశారు. అలాంటి లోపాలు మిగతా చోట్ల ఎక్కడున్నాయో పరిశీలించి కొన్ని మరమ్మతులు చేశారు. 

2015 జూన్‌: గజ్వేల్‌ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్‌ బస్సును రైలు ఢీకొనడంతో 17 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. కాపలా లేని లెవల్‌ క్రాసింగ్స్‌ను యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ మేరకు రైల్వేశాఖ తగిన చర్యలు కూడా తీసుకుంది. 

2018 సెప్టెంబర్‌ 11: కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏకంగా 67 మంది దుర్మరణం పాలయ్యారు. కానీ తర్వాత ఏం జరిగింది? ప్రమాదానికి డ్రైవర్‌ తప్పిదమే అని తేల్చేసి ఆర్టీసీ చేతులు దులుపుకొంది. నిజానికి ఆ బస్సు నడిపింది గతంలో ఉత్తమ డ్రైవర్‌ పురస్కారం అందుకున్న వ్యక్తే. కానీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ బస్సులో వంద మంది కంటే ఎక్కువ మంది ఎక్కిన విషయాన్నీ విస్మరించారు. డీజిల్‌ పొదుపు పేరుతో దూరం నుంచి వెళ్లాల్సిన బస్సును ఘాట్‌ రోడ్డు మీదుగా మళ్లించాలని ఆదేశించిన తీరునూ తొక్కిపెట్టారు. అన్నింటికీ మించి ఆ బస్సు అప్పటికే 13 లక్షల కిలోమీటర్లు తిరిగి పనికిరాకుండా పోయిన డొక్కు బస్సనే సంగతీ పట్టించుకోలేదు. ఇంత భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు చేటు చేసుకోకుండా కొత్తగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుతం నడుస్తున్న డొక్కు బస్సులను పక్కన కూడా పెట్టలేదు. 

ఆర్టీసీలో అంతా గందరగోళం... 
ఆర్టీసీలో అంతా గందరగోళం రాజ్యమేలుతోంది. గత ఐదేళ్లుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. సాధారణంగా ఆర్టీసీకి ఐపీఎస్‌ అధికారి ఎండీగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో ఐపీఎస్‌ అధికారి బదిలీ అయ్యాక.. ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణరావు ఎండీ అయ్యారు. ఆయన మాటను తోటి ఈడీలు పట్టించుకోలేదు. చైర్మన్‌గా ఉన్న సోమారపు సత్యనారాయణను ఆయన లెక్క చేయలేదు. ఫలితంగా ఆర్టీసీ పతనావస్థకు చేరింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఎండీ లేరు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈడీల మధ్య సఖ్యత లేక అంతర్గత కీచులాటలు పెరిగాయి. ఓ అధికారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి స్థితిలో బస్సు ప్రమాదాల నివారణపై దృష్టి సారించే పరిస్థితే లేకుండా పోయింది. 

అప్పు తెచ్చి పరిహారం చెల్లింపు 
ప్రస్తుతం ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రతినెలా జీతాలు చెల్లించేందుకే దిక్కులు చూడాల్సి వస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న ప్రమాదాలు సంస్థను మరింత గుల్ల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 2018లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.46 కోట్లు, అంతకుముందు సంవత్సరం రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా గత ఆరేళ్లలో ఏకంగా రూ.200 కోట్లు చెల్లించింది. ఆర్టీసీ పురోగతి చర్యలకు నిధులు ఉండటంలేదు. దీంతో ప్రతి పనికీ అప్పు తేవాల్సిన దుస్థితి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం గ్రాంటు రూపంలో డబ్బులు ఇవ్వకున్నా, రుణం తీసుకునేందుకు మాత్రం అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పూచీకత్తుపై ఆర్టీసీ అప్పు తెచ్చుకుంటోంది. ఆ అప్పు నుంచే పరిహారం కూడా చెల్లిస్తోంది. 

బస్సుల సంఖ్య పెంచాలి 
తెలంగాణలో వెంటనే ఆర్టీసీ బస్సుల సంఖ్య, అందుకు అనుగుణంగా డ్రైవర్ల సంఖ్య పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు పరస్పరం ఢీకొని ఎక్కువ మంది చనిపోతున్నారు. బస్సులు సరిపోకపోవడంతో జనం ఆటోల్లో పది, పదిహేను మంది వరకు ఎక్కుతున్నారు. అనువుగా లేని రోడ్లలో ఇవి ఢీకొంటున్నాయి. ఈ సమస్య పోవాలంటే వెంటనే ఆర్టీసీ కనీసం 2వేల కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిందే. రోడ్లను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. 
– సుదర్శనం పాదం, మాజీ డైరక్టర్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు 
 

ఇప్పటికైనా సంస్థ కళ్లు తెరవాలి 
తెలంగాణ ఆర్టీసీ బస్సులు సురక్షితమన్న పేరు కొనసాగేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలి. డొక్కు బస్సులు తొలగించటంతోపాటు డ్రైవర్లపై పనిభారాన్ని కూడా తగ్గించాలి. పని ఒత్తిడితో డ్రైవర్లు డ్యూటీలోనే గుండెపోటుతో చనిపోవడం, ప్రమాదాలకు గురికావడం ఇటీవల పెరిగింది. బస్సులో పెద్ద సంఖ్యలో ఉండే ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని వెంటనే సంస్థ కళ్లు తెరవాలి. డ్రైవరకు విరామం కల్పించటంతోపాటు వారికి వైద్య వసతి పెంచాలి. తరచూ మెడికల్‌ టెస్టులు నిర్వహించాలి. 
– నాగేశ్వరరావు, ఎన్‌ఎంయూ 
 

ప్రతి డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండాల్సిందే 
చాలాచోట్ల రోడ్లు సరిగా లేవు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి ఆర్టీసీ డ్రైవర్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు తప్పవు. బస్సులో తాను కాకుండా కనీసం మరో 50 మంది ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని డ్రైవింగ్‌ చేయాలి. ఆరోగ్యం సరిగా లేకుంటే డ్రైవింగ్‌కు వెళ్లకపోవడం చాలా ఉత్తమం. ఏవైనా అనుమానాలుంటే శిక్షణకు హాజరు కావాలి. 
– కంది సురేందర్‌ రెడ్డి, ఉత్తమ డ్రైవర్‌ పురస్కార గ్రహీత  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top