నిర్మాణాల కోసం.. ఇక టీఎస్‌–బీపాస్‌! | TS Ipass For Building Permission In Telangana | Sakshi
Sakshi News home page

నిర్మాణాల కోసం.. ఇక టీఎస్‌–బీపాస్‌!

Jan 15 2020 3:08 AM | Updated on Jan 15 2020 3:08 AM

TS Ipass For Building Permission In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్‌ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్‌–ఐపాస్‌’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్‌ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్‌–బీపాస్‌’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్‌–బీపాస్‌’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది.

వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్‌–బీపాస్‌’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్‌ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్‌ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్‌ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్‌–ఐపాస్‌ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది.  

►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్‌–బీపాస్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్‌ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది.  
►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  
►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు.  
►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్‌ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ.  
►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.  
►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది.  
►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.  
►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు.
►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ జారీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement