టెండర్లొద్దు..

TS Govt Break For New Irrigation Tenders - Sakshi

 ప్రతిపాదిత, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వద్దని ‘ఇంజనీరింగ్‌’కు ఆదేశాలు

సాగునీటి శాఖలో రూ.15 వేల కోట్ల పనులకు బ్రేక్‌

 రోడ్లు, భవనాల శాఖలోనూ కొత్త రహదారులు లేదా విస్తరణ ప్రాజెక్టులకు స్టాప్‌

ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులకు రూ.10,765 కోట్ల బిల్లులు పెండింగ్‌

మంచినీరు, ఇతర నిత్యావసరాలకు మినహాయింపు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి. హైదరాబాద్‌: మంచినీరు, ఇతర అత్యవసరాలు మినహాయించి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ పనులకు టెండర్లు పిలవరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని డిపార్టుమెంట్లలోని ఇంజనీరింగ్‌ విభాగాలకు అత్యవసర సందేశాలు పంపింది. ఆర్థిక మాంద్యం, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాంద్యం నుంచి బయటపడేదాకా కొత్త ప్రతిపాదనలేవీ ఆమోదించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ఆదేశాలతో సాగునీటి శాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు వంటి కీలక డిపార్ట్‌మెంట్లలో రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, పనులకు బ్రేక్‌ పడింది. సాగునీటి శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు, మంజీరా నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం, రహదారులు, భవనాల శాఖ చేపట్టాలని భావించిన హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ నాలుగు లేన్ల రహదారి, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల విస్తరణ పనులు ఆగిపోనున్నాయి. గ్రామీణ రహదారులకు సంబంధించి రూ.150 కోట్ల విలువైన పనులు కూడా ఈ నిర్ణయంతో బ్రేక్‌పడినట్లే. 

సాగునీటి శాఖలో రూ.15 వేల కోట్ల పనులకు బ్రేక్‌..
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు అదనపు మూడో టీఎంసీ నీటిని పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు మూడు స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం అవుతుండగా, ఈ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. నిజాంసాగర్‌ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేందుకు మల్లూర్‌ సమీపంలో రూ.476 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి టెండర్లు పిలవాల్సి ఉంది.

ఇక గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందుకు 10.78 టీఎంసీల సామర్థ్యంతో.. రూ.3,672 కోట్లతో వరంగల్‌ జిల్లా ఘనపూర్‌ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్‌ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్‌ చేశారు. రెండున్నరేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తి చేసేలా ఇటీవలి రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధంగా కాగా వాటిని రద్దు చేశారు. ప్రస్తుత నిర్ణయంతో కొత్త టెండర్లు పిలిచే అవకాశం లేనట్లే. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లకు సంబంధించి కొత్త పనులకు మంజూరు ఇవ్వకపోగా, నిధుల లేమి కారణంగా ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్ల పనులకు కూడా బ్రేక్‌ వేశారు. పంచాయతీ రాజ్‌ పరిధిలోని కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలతో పాటే ఇతర నిర్మాణ పనులు పక్కనపెట్టారు. 

నాలుగు వరసల రోడ్లూ అంతే...
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్లను నిర్మించే ప్రాజెక్టుకు కూడా కొంత గండిపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, నారాయణపేట, ములుగు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్లు లేవు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ పనులూ పడకేసినట్టే. అయితే నాలుగు వరసల రోడ్లను జాతీయ రహదారుల్లో భాగంగా అనుసంధానిస్తున్నందున, కొత్త జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైతే ఈ పనులు పూర్తయినట్టే. 
 
పెండింగ్‌.. రూ.10వేల కోట్లు..
ఇక రైతుబంధు, సన్నబియ్యం, ఆసరా పింఛన్లుకు అధికంగా నిధులు ఖర్చువుతున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. రూ.10,765 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రూ.2వేల కోట్లు, పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,600 కోట్లు, మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలో రూ.700 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

డబుల్‌ రోడ్లకూ బ్రేక్‌..
జిల్లాకేంద్రాల నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ రోడ్లు నిర్మించడానికి రూ.13 వేల కోట్లతో పనులు మొదలై ఇప్పటిదాకా ఉధృతంగా సాగాయి. ఇప్పుడు మాంద్యం వాటికి ముప్పుగా మారింది. రోడ్డు నిర్మాణ పనుల్లో దాదాపు ఏడాది కాలంగా బిల్లులు నిలిచిపోవడంతో చాలా చోట్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. పలు శాఖల్లోని పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలన్న విధానపర నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. రోడ్డు పనులకు రూ.వేయి కోట్లు చెల్లించాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన 54 మండల కేంద్రాల్లో డబుల్‌ రోడ్డు వసతి లేదు. వాటి నుంచి జిల్లా కేంద్రాలకు 687.95 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాల్సి ఉండగా, రూ.1205 కోట్లు అవుతుందని డీపీఆర్‌లు రూపొందించారు. నిధులు మంజూరు చేసే వేళ మాంద్యంతో ఈ పనులకు బ్రేక్‌ పడింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top