పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులివ్వండి | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులివ్వండి

Published Fri, Nov 22 2019 3:52 AM

TRS MPs Asks Piyush Goyal To Allocate Funds For Railway Projects - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ను టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి పెండింగ్‌ ప్రాజెక్టుల వివరాలు సమర్పించారు. భద్రాచలం–సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్‌ పనులు, భద్రాద్రి కొత్తగూడెం–పాండురంగాపురం–సారపాక లైనును భద్రాచలం వరకు పొడిగించాలని, మునిరాబాద్‌–మహబూబ్‌నగర్‌ (246 కి.మీ) లైన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు, పలు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఇక విద్యుద్దీకరణకు నిధులు మంజూరైన గద్వాల్‌–రాయ్‌చూర్, లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్‌ పనుల్లో వేగం పెంచాలని కోరారు. పఠాన్‌చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్‌ రైల్వే లైన్‌ పనులను ముఖ్య ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్, మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఖమ్మం స్టేషన్‌లో కేరళ, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌ ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థాపించాల్సిందిగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు.  

తాండూర్‌లో రైళ్లకు హాల్ట్‌ ఇవ్వండి.. 
తాండూర్‌లోబెంగళూరు–నాందేడ్, హుబ్లీ–సికింద్రాబాద్, బీదర్‌–యశ్వంత్‌పూర్, పద్మావతి, గరీబ్‌రథ్, హుస్సేన్‌సాగర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్‌ ఇవ్వాల్సిందిగా  లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. నారాయణ్‌పేట జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా లోక్‌సభలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.  

Advertisement
Advertisement