పద్మక్క శంఖారావం

TRS Leader Padma Devender Reddy Election Campaign - Sakshi

మెదక్‌ నియోజకవర్గంలో గులాబీ  సైన్యం కదం తొక్కింది. బుధవారం మెదక్‌ పట్టణంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి   ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట మండలం లో గిరిజనులు బహూకరించిన కత్తిని చూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

మెదక్‌ జోన్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి రైతుల పాదాలు కడుగుతామని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్‌ నియోజకవర్గంలో ఆమె మొదటిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి రైతుల కళ్లలో కన్నీళ్లు రానివ్వకుండా చేస్తామన్నారు.  జిల్లా హెడ్‌క్వార్టర్‌గా చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చామన్నారు.  తనకు మరోసారి టికెట్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మెదక్‌  నియోజకవర్గ ఇన్‌చార్జి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్‌ అకిరెడ్డి కృష్ణారెడ్డి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్‌ గంగ నరేందర్, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాగి అశోక్, కౌన్సిలర్లు అంకం చంద్రకళ, బట్టి సులోచన, జెల్ల గాయత్రి,  వెంకటరమణ, మాయ మల్లేశం, ఆర్కె శ్రీనివాస్, మెదక్‌ ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, నాయకులు లింగారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, జీవన్‌రావు, గడ్డమీది కృష్ణాగౌడ్, సంగశ్రీకాంత్,  సాయిలు  పాల్గొన్నారు. 

పలువురి ఆశీర్వచనాలు..
అంతకు ముందు  పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి భారీగా బైక్‌ ర్యాలీగా ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి వెళ్లారు. దీంతో మెదక్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల నుంచి సుమారు మూడు వేలకు పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.  అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద బ్రాహ్మణులు భాష్యం మధుసూదానాచార్యులు, వైద్య శ్రీనివాస్‌లు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పట్టణంలోని పిట్లం చెరువు కట్టపై దర్గాలో, మెదక్‌ సీఎస్‌ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు ప్రచార రథంలో మెదక్‌కు చేరుకున్న పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు బాణా సంచాలు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top