మరో వివాదంలో టీఆర్‌ఎస్‌ నేత

 trs corporator vittal reddy followers attacked on liquor shop owner - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైన్ షాప్ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో తన కొడుకు యశ్వంత్ రెడ్డి పేరు మీద మూసారాంబాగ్‌లో ఒక వైన్స్ షాప్‌ను దక్కించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి వ్యాపారం కొనసాగిస్తానని నమ్మబలికి వ్యాపారంలో వాటా నిమిత్తం అతని వద్ద రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీరా ఇప్పుడు వాటా ఇవ్వకపోవడమేగాక​ తీసుకున్న డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వడం లేదు.

తన కుమారులు, తన అనుచరులతో అతని ఇంటిపై రెక్కీ నిర్వహించడంతో పాటు శుక్రవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న విజయ్‌భాస్కర్ రెడ్డిపై విఠల్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. 'నీవు విఠల్‌రెడ్డి పై కేసు పెడతావా, మమ్మల్నే ఇచ్చిన డబ్బులు అడుగుతావా' అంటూ నిలదీశారు. నీకు ప్రాణం మీద ఆశ లేదా అంటూ బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, అతని కుమారులు యశ్వంత్ రెడ్డి, మణికాంత్ రెడ్డిలతో తనకు ప్రాణభయం ఉందని, తనకు న్యాయం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో తనకు మాముళ్లుగా రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు రద్దు చేయిస్తానంటూ  ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణపు పనులు చేస్తున్న కూలీలపై దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో భవన యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 324, 341, 385, 447, 506 సెక్షన్ల కింద కార్పొరేటర్ విఠల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... నగరంలోని కొందరు కార్పొరేటర్లు అక్రమ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top