తెలంగాణ వచ్చినా దోపిడీ ఆగలేదు 

TRS cannot Develop Telanagana says BV Raghavulu  - Sakshi

ప్రజల ఆకాంక్షలను 

దెబ్బతీసిన టీఆర్‌ఎస్‌ 

ప్రత్యామ్నాయం వస్తేనే అభివృద్ధి 

ప్రజల కోసం పనిచేసే వారికే బీఎల్‌ఎఫ్‌ టికెట్లు 

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

సాక్షి, ఇబ్రహీంపట్నం: తెలంగాణ వచ్చినా దోపిడీ ఆగడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు వీడిపోతే బడా బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వైద్య, విద్యాసంస్థల యాజమానులే లాభం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోని చంద్రుల పాలనకు తేడాలేదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఎం పార్టీ అభ్యర్థిగా పగడాల యాదయ్య నామినేషన్‌ దాఖలు చేసిన సోమవారం నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలు కుబేరులకే  అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు తెలిపారు. ఆయా పార్టీలకు సామాజిక ఎజెండాలేదన్నారు. వీటికి ప్రత్యామ్నాయ పార్టీ రావాల్సిన అవసరంవుందన్నారు. అప్పుడే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

ఆ లక్ష్యంతో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భవించిందని, సామాజిక న్యాయం కోసం ముందుకు వెళుతుందన్నారు. ప్రజా సేవ చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న వారికే బీఎల్‌ఎఫ్‌లో సముచిత స్థానం కల్పించి సీట్లను కేటాయించినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు,  ఉద్యోగాలు, భూములు పొందే హక్కు చట్టప్రకారం ఉండాలన్నారు. గాలిలో మేడలు కట్టే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే యత్నాలు ఆయా పార్టీలు చేస్తున్నాయన్నారు.  ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ, నాయకులు కొడిగాళ్ళ భాస్కర్, గొరెంకల నర్సింహ, సామేల్, మధుసూదన్‌రెడ్డి, జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top