‘ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌’ చట్టవిరుద్ధం.. తీర్పు ఒక్క కేసుకే పరిమితమా?

Transport Dept Violates High Court Directions - Sakshi

వాహన ధరపైనే జీవితకాల పన్ను

‘ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌’ చట్టవిరుద్ధమన్న హైకోర్టు

ఇన్‌వాయీస్‌ పైనే లైఫ్‌ట్యాక్స్‌ తీసుకోవాలని స్పష్టీకరణ

న్యాయస్థానం ఆదేశాలు రవాణాశాఖ బేఖాతరు 

తీర్పు ఒక్క కేసుకే పరిమితమంటూ వాదన  

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఉన్నత న్యాయస్థానం ఏదైనా కేసులో వెలువడిన తీర్పు.. చట్టాలను అనుసరించి ఆ తరహా అన్ని కేసులకు వర్తిస్తుంది.. ప్రభుత్వం, అధికారులు ఆ తీర్పును అమలు చేసి తీరాలి. కానీ రవాణా శాఖ మాత్రం అందుకు మినహాయింపు అంటోంది. వాహనాల జీవిత కాల పన్ను విధింపులో వెలువరించిన తీర్పును అమలు చేయకపోగా.. అది కేవలం ఒక్క కేసుకు సబంధించింది మాత్రమేనని ఆ శాఖ వాదిస్తోంది. వాహనాల జీవితకాల పన్నును వినియోగదారుడు చెల్లించిన ధరపైనే విధించాలన్న హైకోర్టు ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌తో నిమిత్తం లేకుండా ఇన్‌ వాయీస్‌ ఆధారంగానే  లైఫ్‌ట్యాక్స్‌ తీసుకోవాలని రెండు నెలల క్రితమే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ ఈ తీర్పును అమలు చేయడంలో రవాణాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న వెలువడిన హైకోర్టు ఆదేశాలు కేవలం ‘ఆ ఒక్క కేసు’కు సంబంధించి మాత్రమేనంటూ ఆ శాఖ అధికారులు వితండ వాదం చేయడం గమ నార్హం. మరోవైపు జీవితకాల పన్ను విధింపుపై కూడా రవాణాశాఖలో స్పష్టత కొరవడింది. ఉన్నతస్థాయి అధికారులకు, కిందిస్థాయి అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో పన్ను వసూళ్లపై సందిగ్ధత నెలకొంది.

వాహన షోరూమ్‌ డీలర్లు వినియోగదారులకు ఇచ్చే రాయితీలతో సంబంధం లేకుండా వాహనాల తయారీదారు నిర్ణయించిన ధర ప్రకారమే జీవితకాల పన్ను విధించాలని అప్పటి రవాణా కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా రెండేళ్ల క్రితం అధికారులను ఆదేశించారు. ఎక్స్‌షోరూమ్‌ ధరలపై లైఫ్‌ ట్యాక్స్‌ వసూలు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. దీంతో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతివాహనానికి ఆయా డీలర్ల నుంచి ‘ఎక్స్‌షోరూమ్‌ ధర’ల జాబితాను తెప్పించి మరీ అదనపు వసూళ్లు చేపట్టారు. దీంతో డీలర్ల నుంచి రాయితీల రూపంలో వినియోగదారుడికి కొంత మేరకు ఊరట లభించినప్పటికీ దానికి రెట్టింపు చొప్పున అదనంగా జీవితకాల పన్ను రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఇది ఇటు వినియోగదారుల్లోనూ, అటు వాహన డీలర్లలోనూ  ఆందోళనకు దారితీసింది. ఇన్‌వాయీస్‌ ధరలపైనే పన్ను వసూలు చేయాలని డీలర్లు రవాణా అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు నిరాకరించడంతో ఖైరతా బాద్‌  సెంట్రల్‌ ప్రాంతీయ రవాణా కార్యాలయం పరిధికి చెందిన ఒక డీలర్, మరో వినియోగదారుడు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ మే రకు ఉన్నత న్యాయస్థానం ‘ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌’ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ఇన్‌వాయీస్‌’ ప్రకారమే పన్ను విధించాలని ఆదేశించింది.  

ఆ ఒక్క కేసుకే పరిమితం కాదు...
జీవితకాల పన్నులో కోత విధించేందుకే డీలర్లు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నారని రవాణా అధికారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక వాహనం ఖరీదు  రూ.8.70 లక్షలు ఉంటే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోను ఏడాది ఎండింగ్‌ సీజన్‌లో వాహనం ధరపై రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు డీలర్లు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. అంటే రూ.8.40 వేలకే వినియోగదారుడికి వాహనం లభిస్తుంది. ఇది ఇన్‌వాయీస్‌ ధర. కానీ ఎక్స్‌షోరూమ్‌ ధర మాత్రం రూ.8.70 లక్షలు ఉంటుంది. ఇన్‌వాయీస్‌ ధరపై జీవితకాల పన్ను తగ్గుతుంది. ఇలా ఒక్కో వాహనంపైనా వాటి ఖరీదు మేరకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూడా నష్టపోవాల్సి వస్తుందని రవాణా అధికారులు అప్పట్లో అంచనా వేశారు. ఎక్స్‌షోరూమ్‌ ధరలపైనే పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో ఒక్క ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలోనే ఏడాది కాలంలో అప్పటి వరకు విక్రయించిన వాహనాలపైన సుమారు రూ.30 కోట్ల మేర తిరిగి లైఫ్‌ ట్యాక్స్‌ వసూలు చేశారు. అన్ని కార్యాయాల నుంచి రూ.100 కోట్లకు పైగా రాబట్టారు. ఎక్స్‌షోరూమ్‌ ధరలపై పన్ను విధించడాన్ని ఒక వినియోగదారుడు సవాల్‌ చేయడంతో పరిస్థితి తలకిందులైంది. మరోవైపు ఈ కేసును ఒక్క ఖైరతాబాద్‌ ఆర్టీఏకు మాత్రమే పరిమితం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వినియోగదారుల హక్కులు, చట్టాలను అనుసరించి ఏ ఒక్క కేసులో వెలువడిన తీర్పయినా అందరికీ వర్తిస్తుందని, అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇన్‌వాయీస్‌ ప్రకారమే లైఫ్‌ట్యాక్స్‌ తీసుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వాహనాల షోరూమ్‌ డీలర్లు సైతంఇన్‌వాయీస్‌ ధరలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

స్పష్టత లేకపోవడం వల్లనే..
మోటార్‌ వాహన చట్టంలో వాహనం ధరపై స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  రూ.10 లక్షల కంటే ఖరీదైన వాహనాలపై 14 శాతం లైఫ్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు. దీంతో ఈ పన్ను భారాన్ని తగ్గించుకొనేందుకు కొందరు డీలర్లు వినియోగదారులకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. దీంతో లైఫ్‌ట్యాక్స్‌ 14 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పడిపోతుంది. రవాణాశాఖ ఆదాయం దృష్టిలో ఇది పెద్ద నష్టమే. కానీ అదే సమయంలో వినియోగదారుడి కొంత మేరకు ఊరటతో పాటు డీలర్లకు సైతం కలిసొస్తుంది. ఈ నష్టాన్ని నివారించేందుకు ‘ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌’ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఆ మేరకు మోటారు వాహన చట్టంలో మార్పు చేయలేదు. తాజా హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రం ఇన్‌వాయీస్‌ ప్రకారం జీవిత కాల పన్ను విధించాల్సిందే. కానీ ఈ దిశగా రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.  
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top