పెళ్లింట విషాదం | The Tragedy Of The Wedding In Kothakota | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Jul 1 2018 8:36 AM | Updated on Oct 8 2018 5:07 PM

The Tragedy Of The Wedding In Kothakota - Sakshi

 క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తున్న ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌ సిబ్బంది   

కొత్తకోట : అందరూ పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లిపందిరి వేయడానికి ఆకు తీసుకురావడానికి వెళ్లిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకునేలోపు విషాద వార్త వచ్చింది.. ఆకుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని ఫోన్‌ రావడంతో బంధువులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడి ఉండటంతో బోరున విలపించారు. ఈ సంఘటన కొత్తకోట మండలంలోని కనిమెట్ట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పాలెం గ్రామానికి చెందిన షేవ రాములు రెండో కుమారుడు కురుమూర్తి పెళ్లి ఆదివారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ సమీపంలో పెళ్లి పందిరికి కావాల్సిన ఆకు తీసుకురావడానికి పెళ్లి కుమారుడి అన్న మల్లేష్, బంధువులు వెంకటేష్, కృష్ణయ్య, రాచెంటి మల్లేష్, శివ, ఎన్‌.రాములు, శంకర్‌లు కలిసి ట్రాక్టర్‌లో శుక్రవారం రాత్రి బయలుదేరారు.

పెళ్లి ఆకు తీసుకుని సుమారు రాత్రి 2 గంటల ప్రాంతంలో పాలెంకు బయలుదేరారు. అయితే ఈ క్రమంలో సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి.. మద్దిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్‌(22), రాచెంటి మల్లేష్, రాములును గ్రామంలో వదిలి, పాలెంకు రావాలని బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ బోల్తాపడి అందరూ చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో వెంకటేష్, కృష్ణయ్య,  షేవ మల్లేష్‌లకు తీవ్రగాయాలవగా.. ఎన్‌.రాములు, రాచెంటి మల్లేష్, శివ, శంకర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేష్‌ మృతిచెందగా.. కృష్ణయ్య, షేవ మల్లేష్‌లను  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.  


పాలెంలో విషాదఛాయలు.. 
పందిరి వేయడానికి ఆకు తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు వెంకటేష్‌ మృతిచెందగా.. పెళ్లి కుమారుడు అన్న షేవ మల్లేష్‌ తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలు నిలిపివేశారు. ఆదివారం జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న బంధువులు రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఇటు వెంకటేష్‌ స్వగ్రామం మద్దిగట్లలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

జేసీబీ వాహనం ఢీకొని..  
బిజినేపల్లి రూరల్‌ (నాగర్‌కర్నూల్‌): మండలం లోని బోయాపూర్‌ వద్ద శనివారం మధ్యాహ్నం అదే గ్రామం నుంచి ఎదురుగా వస్తున్న జేసీబీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన ఖానాపురం కృష్ణయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణికులు గమనించి 108లో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మోకాలు ప్రాంతంలో తీవ్రంగా ఎముక విరిగిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement