ఫైన్‌ వేసినా మారడం లేదు

Traffic Police Helmet Awareness Rally - Sakshi

పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ

హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీ

సాక్షి, నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ సూచించారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్‌ (జరిమానా) వేస్తున్నామని, అయినా వారిలో మార్పులు రావటం లేదన్నారు. అందుకే హెల్మెట్లు ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్‌ వాడకంపై ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్‌ మైదానంలో సీపీ జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. సీపీ స్వయం గా బైక్‌ను నడిపారు. కంఠేశ్వర్‌ కమాన్, ధర్నాచౌక్, రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవిరోడ్డు చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రూ పార్కు పెద్దబజార్, న్యాల్‌కల్‌ చౌరస్తా, పూలాంగ్‌చౌరస్తా, ఎల్లమ్మగుట్టచౌరస్తా, రైల్వేకమాన్, కంఠేశ్వర్‌ బైపాస్‌ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం సీపీ మాట్లాడుతూ తల భాగం ఎంతో సున్నితమైందని, రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించక పోవటంతోనే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలన్నారు. అదనపు ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ నాగేశ్వర్‌రావు, ట్రాఫిక్‌ ఎస్సైలు పాల్గొన్నారు.

సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీపీ
పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ గురువారం మధ్యహ్నం సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలతో మాట్లాడారు. ఆదివారం శ్రీరామ నవమి పండుగ నేపథ్యలో నిర్వహించే ర్యాలీలకు బందోబస్తు చర్యలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రామాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏడు ప్రధాన అంశాలపై కరపత్రాల విడుదల
రహదారి భద్రత, ఆత్మహత్యల నివారణ వంటి ఏడు ప్రధాన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పోలీస్‌శాఖ ఏడు కరపత్రాలను విడుదల చేసింది. సీపీ కార్తికేయ గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీస్‌ కళాబృందాలకు ఆయా కరపత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో కళాబృందాలు పర్యటిస్తాయన్నారు. ప్రజలలో చైత్యనం వచ్చినప్పుడే ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుతాయని, అందుకోసం పోలీస్‌శాఖ తరపున ఏడు అంశాలపై కరపత్రాలు రూపొందించిందని చెప్పారు. ఎస్‌బీ సీఐ–2 రాజశేఖర్, పోలీస్‌ కళాబృందం ఇన్‌చార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్, సాయాగౌడ్, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

ఏఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం
గుండె నొప్పితో మృతి చెందిన ఏఎస్సై కుటుంబానికి సీపీ కార్తికేయ గురువారం ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. మాక్లూర్‌ పోలీస్‌స్టేష¯న్‌కు చెందిన ఏఎస్సై పోచయ్య జనవరి 11న గుండె నొప్పితో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి పోలీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది మొత్తం ఒకరోజు వేతనాన్ని డెత్‌ ఫండ్‌ (ఆర్థిక సాయం) రూపంలో రూ.1,29,300 చెక్కును సీపీ పోచయ్య భార్య రుక్మాబాయికు అందజేశారు. ఎస్‌బీ సీఐ వెంకన్న, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షకీల్‌ పాషా, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి ఎస్‌ఎస్‌ జై కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top