తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట భారీ బతుకమ్మ సంబరానికి వేదికైంది.
సిద్దిపేట అర్బన్: తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట భారీ బతుకమ్మ సంబరానికి వేదికైంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం 30వ తేదీన నిర్వహించే ఈ సంబరానికి అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ ఆటలు, పాటలను తెలంగాణ ఉద్యమంలో అస్త్రాలుగా ఎక్కుపెట్టిన సిద్దిపేట, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ ఏకమై ఏర్పాట్లు పూర్తి చేశారు.
బతుకమ్మ పండుగలో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు సిద్దిపేటకు చేరుకోనున్నారు. శరభేశ్వరాలయం, ఎల్లమ్మగుడిలలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆమె పట్టణంలోని మంత్రి హరీష్‌రావు ఇంట్లో, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఇంట్లో మహిళలతో కలిసి బతుకమ్మలను తయారు చేస్తారు. సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు.
సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామ మహిళలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఆమెతో జత కలుస్తారు. వెంకటేశ్వర స్వామి గుడి నుంచి బతుకమ్మల ఊరేగింపు ప్రారంభం అవుతుంది. ఒగ్గు వాయిద్య కళాకారులు, డప్పు కళాకారులు, దాండియా, కోలాటం కళాకారులు తమ కళావిన్యాసాలను ఊరేగింపులో ప్రదర్శించడానికి భారీ ఏర్పాట్లు జరిగాయి.
నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
బతుకమ్మల నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆటను ఆడుకోవడానికి వీలుగా భారీ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. ఒక వేదిక పైనుంచి కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుండగా, మరోవేదికపై ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ప్రసంగాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో పాటు ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. దీంతో కలెక్టర్ రాహుల, ఎస్పీ బాజ్‌పాయ్ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.