ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ దారుణాలు మొదలయ్యూయూ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.
కాల్చి చంపిన కోయ కమెండోలు.. మరో ముగ్గురి అపహరణ
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ దారుణాలు మొదలయ్యూయూ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గతంలో సల్వాజుడుం కార్యకర్తలు అక్కడి ఆదివాసీలపై ఆకృత్యాలు సాగించి, దాడులు చేయడం, గృహ దహనాలు, అమాయక ఆదివాసీలను కాల్చిచంపడం వంటి అనేక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సల్వాజుడుం వ్యవస్థను రద్దు చేసింది. ఆ స్థానంలో రెండేళ్ల క్రితం కోయ కమెండోస్‌ను ఏర్పాటు చేసింది.
అయితే, ఈ కోయ కమెండోలు కూడా సల్వాజుడుం తరహాలోనే దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా కుంట బ్లాక్ గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆదివాసీలను కాల్చి చంపినట్లు సమాచారం. తుమ్మలబట్టి గ్రామానికి చెందిన ఇడమ, బయ్యాతో పాటు ఇత్తన్‌పాడ్‌కు చెందిన మూడను గొల్లపల్లి వాగు వద్ద కాల్చి చంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, ఈ మార్గం గుండా పనులకు వెళ్తున్న పోలెం గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివాసీ కూలీలను అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.