ఈ కొలువు.. మావల్ల కాదు


సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆసరా పింఛన్ల మంజూరు, పంపిణీ వ్యవహార ం ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చింది. అర్హులకు పింఛన్ల అందడం లేదని, అనర్హులకే చోటు దక్కుతోందనే విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వాన్ని తాజాగా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఇచ్చిన అల్టిమేటం మరింత ఇరకాటంలోకి నెట్టింది.

 

  ఆసరా పింఛన్ల మంజూరులో అనర్హులకు చోటు కల్పించాలని తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు చాలాచోట్ల తమపై భౌతికదాడులకు దిగడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల పేరుతో తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగాలు చేయడం తమవల్ల కాదని పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. అందులో భాగంగా ఈనెల 23 నుంచి మూకుమ్మడిగా సెలవుపై వెళ్లాలని ఎంపీడీవోలు, ఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్‌లు నిర్ణయించారు. ఇదే విషయంపై తెలంగాణ మండల పరిషత్ డెవలెప్‌మెంట్ అధికారుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ నాయకులు శనివారం కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్ల మంజూరు, పంపిణీ సందర్భంగా జిల్లాలో జరిగిన కొన్ని సంఘటలను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

 

 వీణవంక మండలంలో ఈనెల 19న ఎంపీడీవో గదికి అకారణంగా తాళంవేసి విధులకు ఆటంకం కలిగించిన అధికార పార్టీ నాయకుడు ఆవాల హరిబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. పైగా సదరు వ్యక్తి తిరిగి ఎంపీడీవోపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెడితే పోలీసులు ఆయనకే వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. దీంతో మండలంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులంతా గత రెండ్రోజులుగా సామూహిక సెలవుపై వెళ్లిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

 

 ఇల్లంతకుంట మండలం సోమారంపేట పంచాయతీ కార్యదర్శిపై అక్కడి టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు భౌతికదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి పంచాయతీ జూనియర్ అసిస్టెంట్, కార్యదర్శులపై పలువురు కత్తితో దాడి చేసి గాయపరిచారని తెలిపారు.

 

 బోయినపల్లి మండలం వరదపెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి జైపాల్‌రెడ్డితోపాటు వీణవంక పంచాయతీ కార్యదర్శులపై పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. చొప్పదండి మండలంలోని చాకుంట పంచాయతీ కార్యదర్శిపై దాడి చేయడమే కాకుండా కార్యాలయానికి తాళం వేశారని వాపోయారు.

 

 మంథని మండలంలో పింఛన్ రాలేదనే కోపంతో కారోబార్‌పై కి రోసిన్ పోశారని వాపోయారు. ఇదే నియోజకవర్గంలోని కమాన్‌పూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి మారుతిపై భౌతికంగా దాడికి దిగుతారనే సమాచారం రావడంతో వారం రోజులుగా సెలవుపై వెళ్లారని తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న వారు అనర్హులైనప్పటికీ పెన్షన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top