బతుకుపై బండ'రాయి' | Sakshi
Sakshi News home page

బతుకుపై బండ'రాయి'

Published Thu, Aug 30 2018 1:51 AM

There is no Underground water for farmers in the Sangar Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని నాగల్‌గిద్ద మండలం మేత్రి రాందాస్‌కు రాళ్లలతో నిండిన ముప్పావు ఎకరం భూమి ఉంది. దానిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందులో పంటలు సరిగా పండక కుటుంబంతో సహా ఉపాధి కోసం వలస బాట పట్టాడు. వర్షాలకు మాత్రమే పంటలు పండే ఆ భూముల్లో వర్షాభావంతో ఇప్పటికే వేసిన పెసర పంట సగానికి పైగా ఎండిపోయింది. నారాయణఖేడ్‌ ప్రాంతంలో రాళ్ల భూముల్లో రైతులు చేస్తున్న ‘కష్టాల సాగు’కు రాందాస్‌ కథ అద్దం పడుతోంది. 

నారాయణఖేడ్‌ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో రాళ్ల భూమి విస్తరించి ఉంది. వీటిపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎలాంటి నీటి ఆధారం లేకపోవడంతో పూర్తిగా వర్షాధార పంటలను సాగు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వర్షాధార పంటలు జొన్న, పెసలు, మినుములు తదితరాలను పండిస్తున్నారు. నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద, మనూరు, కంగ్టి మండలాల్లో ఈ తరహా ‘ఎర్ర నేలలు’ఎక్కువగా ఉన్నాయి. పలుగు రాళ్లతో కూడిన ఈ భూములను స్థానికంగా ఎర్ర మొరం భూములు లేదా పడావు భూములుగా వ్యవహరిస్తారు. పూర్తిగా రాళ్లతో కూడిన ఈ భూమిలో భూగర్భ జల జాడలు ఎక్కడా కనిపించడం లేదు. బావుల తవ్వకానికి ఈ భూములు అనుకూలం కావని రైతులు చెబుతున్నారు. 300–400 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని కొందరు రైతులు చెబుతున్నారు. దీంతో వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు.  

నాకు ఉన్న భూమితో పాటు మరో ఎకరా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నువ్వులు, అవిశెలు వంటి గడ్డి జాతి పంటలు పండిస్తున్నా. రాళ్ల భూమి కాబట్టి వేరే పంటలు వేసే అవకాశం లేదు. ఈ భూముల్లో సాగు చేసినా లాభం లేదనే ఉద్దేశంతో చాలా మంది పంటలు వేయడం మానేశారు. వర్షం ఎక్కువ కురిసినా నీటి జాలుతో వేర్లు కుళ్లిపోయి పంటలు దెబ్బతింటాయి. ఈ భూములకు ఎకరా కౌలుకు రూ.5 వేలు ఇవ్వడం కూడా కష్టమే. ఏవైనా ఫ్యాక్టరీలు, తోటలు పెడితే ఏదన్నా ప్రయోజనం కలుగుతుంది.
– బక్కప్ప, రైతు, నాగల్‌గిద్ద

మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎలాంటి నీటి ఆధారం లేదు. వర్షాధార పంటలు కంది, పెసర, జొన్న వేస్తున్నాం. పూర్తిగా రాళ్లతో కూడిన భూమి కావడంతో పత్తి, వరి పంటలు వేసేందుకు మాకు అవకాశం లేదు. ఏటా దుక్కి దున్నేందుకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుంది. వర్షాలు లేకపోతే పంట చేతికందే పరిస్థితి ఉండదు. ఎకరాకు ఒక్కో సారి క్వింటాలు కందులు కూడా పండవు. వానలు పడితే చేనులో పని చేసుకుంటం. లేదంటే తలోదారిన వేరే పనికి వెళ్తాం. 
– శాంతాబాయి, బంగ్లా తండా,నాగల్‌గిద్ద మండలం 

వర్షం లేకుంటే ఉపాధి బాటే.. 
తొలకరి మొదలవ్వగానే జొన్నలు, కందులు, పెసలు, మినుములు తదితర పంటలు వేస్తారు. జొన్న కొంత మేర వర్షాభావాన్ని తట్టుకోవడం, పెసలు, మినుములు తక్కువ కాల వ్యవధిలో దిగుబడి రావడంతో రైతులు వీటి సాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రాళ్లతో కూడిన భూమిని దుక్కి దున్నేందుకు ఏటా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒకసారి రాళ్లను తొలగించినా, ఆ నేలల స్వభావం వల్ల మరుసటి సంవత్సరం కూడా మళ్లీ రాళ్లు వస్తాయని అంటున్నారు. వర్షాలు ఎక్కువ కురిస్తే మృత్తిక క్షయం జరుగుతోందని, తక్కువ పడితే పంటలు ఎండిపోయి పెట్టుబడి కూడా రావడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరు అందించడం లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే తమకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయిన ఈ భూములు ప్రస్తుతం ఎకరాకు రూ.2 లక్షల పైనే ధర పలుకుతున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement