శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుగాను..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుగాను ఈ నెల 7, 14 తేదీల ఆదివారాల ను ప్రత్యేక క్యాంపెయిన్ డేలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.
ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, ఈవీఎం గోదాముల నిర్మాణం, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్‌లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. గత ఆదివారం నిర్వహించిన క్యాంపెయిన్‌లో చాలా కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో లేరని ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందాయన్నారు.
వచ్చే 2 ఆదివారాల్లో నిర్వహించే క్యాంపెయిన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌ఓలు తప్పనిసరిగా కేంద్రాల్లో ఉండి ఓటర్ల నమోదు, సవరణలపై దరఖాస్తులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక క్యాంపెయిన్‌ల నిర్వహణపై కేబుల్ టీవీలు, పత్రికలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. జనవరి 1, 2015 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా సాధారణ ఓటరుగా, నవంబరు 1, 2011 నాటికి డిగ్రీ పూర్తయిన వారంతా గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. సాధారణ ఓటరు జాబితా సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు 33,083 దరఖాస్తులు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరు నమోదుకు గాను 6,400 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. మొత్తం అందిన దరఖాస్తుల్లో మూడో వంతు గత ఆదివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌లోనే అందాయని వివరించారు. జిల్లాలో ఈవీఎం గోదాము నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి మరో రూ.20లక్షలు అవసరమవుతాయని తెలిపారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి పూర్తి నివేదిక ను త్వరలో సమర్పిస్తామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ సూర్యారావు, ఎన్నికల విభాగం తహసీల్దార్ జ్ఞానప్రసూనాంబ పాల్గొన్నారు.