బకాయిల ‘ఎత్తిపోత’

Telangana Lift Irrigation Project Power Bills Pending To Discom - Sakshi

ఎత్తిపోతల విద్యుత్తు భారం రూ.3,500 కోట్లు

ప్రధాన పథకాల కింద రూ.3181.38 కోట్లు

ఒక్క కల్వకుర్తి కిందే 1,433.06 కోట్లు

రాష్ట్రంలో 350 పంపులకుగాను 217 పంపులు వినియోగంలోకి..

సాక్షి, హైదరాబాద్‌ : విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(డిస్కం)కి బకాయిల షాక్‌. రాష్ట్రంలోని ప్రధాన ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,500 కోట్ల మేర బకాయిలను డిస్కంకు చెల్లించాలి. ఇందులో ఆగస్టు వరకు మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద రూ.3,181.38 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రభుత్వ లక్ష్యం. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్దేశిత ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 357 మోటార్లు ఉండగా, 217 పంపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. 

ఏఎమ్మార్పీ కింద రూ.రూ.638 కోట్లు
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఎలిమి నేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) నుంచి ఏటా 16.50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నా రు. ఒక్క టీఎంసీకి రూ.8 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ మూడేళ్లలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా ఇప్పటివరకు ఒక్క రూపా యి కూడా చెల్లించలేదు. ఈ ప్రాజెక్టుపైనే రూ.638 కోట్ల బకాయిలున్నాయి. ప్రతిసారి విద్యుత్‌ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. అప్పుడప్పుడూ క్యాంపు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేస్తోంది. అయితే, ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వస్థాయిలో మాట్లాడి బయటపడుతున్నారు. 

ఇతర ప్రాజెక్టులపై...
గత ఏడాది నెట్టెంపాడు కింద 6.7 టీఎంసీ, బీమా 12 టీఎంసీ, కోయిల్‌సాగర్‌ 5 టీఎంసీ, కల్వకుర్తి 31 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. వీటి బిల్లులే రూ.957 కోట్ల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుత సీజన్‌లో అన్ని ప్రాజెక్టుల కింద 30 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. దీంతో బకాయిలు రూ.1,650 కోట్లకు చేరాయి. మొత్తంగా మేజర్‌ ఇరిగేషన్‌ పథకాల కిందే రూ.3,181 కోట్లు, మైనర్‌ ఇరిగేషన్, ఐడీసీ పథకాల కింద మరో రూ.123 కోట్ల బకాయిలున్నాయి. వీటికి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఎత్తిపోతలకు అయిన చార్జీలను కలిపితే మొత్తంగా రూ.3,500 కోట్ల మేర బకాయిలున్నట్లు లెక్క తేలుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top