ఫోర్జరీ చేస్తే కేసు పెట్టరా? 

Telangana High Court On MPs Signs Forgery - Sakshi

ఐదుగురు ఎంపీల తీరుపై ప్రశ్నలు సంధించిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌ : ‘పార్లమెంటు సభ్యుడి సంతకాన్ని మున్సిపల్‌ అధికారులు ఫోర్జరీ చేస్తే సదరు ఎంపీ ఎందుకు పోలీసు కేసు పెట్టలేదు. వార్డుల విభజన ఇతర సమాచారాన్ని తెలియజేయకపోయినా, అరకొరగా తెలిపినా ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు ఎంపీలు తమ నిరసన ఎందుకు తెలియజేయలేదు. నియోజకవర్గంలో లేకపోయినా, ఢిల్లీ లేదా విదేశాల్లో ఉన్నా ఈ–మెయిల్‌ ద్వారా ఎంపీలు తమ అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఉన్నా ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా రిట్‌ పిటిషన్లు దాఖలు చేసి హైకోర్టును ఎలక్షన్‌ ట్రిబ్యునల్‌గా మార్చేస్తే ఎలా..’అని హైకోర్టు ఐదుగురు ఎంపీల రిట్లపై ప్రశ్నలు సంధించింది.

మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా చేశారని, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నామని అధికారులు చెప్పడం వాస్తవం కాదంటూ బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌(కరీంనగర్‌), ధర్మపురి అరవింద్‌(నిజామాబాద్‌), సోయం బాపూరావు(ఆదిలాబాద్‌), కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(భువనగిరి), ఎ.రేవంత్‌రెడ్డి(మల్కాజిగిరి)లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లలో ఎంపీలు తాము ఏ పార్టీనో పేర్కొనకపోవడాన్ని ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అభ్యంతరాలు తన నుంచి స్వీకరించినట్లు మున్సిపల్‌ అధికారులు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని బండి సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. మున్సిపల్‌ ఎన్ని కల ముందస్తు ప్రక్రియ తప్పులతడకగా జరిగిందని, వీటిని శాస్త్రీయంగా చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిర్మల్‌కు చెందిన కె.అన్జుకుమార్‌రెడ్డి, న్యాయవాది ఎస్‌.మల్లారెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.  

29రోజుల్లో ఎలా సాధ్యం
మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తి చేసేందుకు 150 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరితే సింగిల్‌ జడ్జి 109 రోజులు ఇచ్చారని, అయితే ప్రభుత్వం కేవలం 28 రోజుల్లోనే పూర్తి చేయడాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది నరేష్‌రెడ్డి తప్పుపట్టారు. ఇష్టానుసారంగా చేసి అంతా చట్ట ప్రకారం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
 
చట్ట ప్రకారమే చర్యలు.. 
అభ్యంతరాలన్నింటినీ చట్ట ప్రకారం పరిష్కరించామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదించారు. ప్రజాప్రతినిధులకు అన్ని అవకాశాలు ఇవ్వడమే కాకుండా పత్రికల్లో ప్రకటనల్ని విడుదల చేశామన్నారు. వీటిపై అప్పుడు స్పందిం చని ఎంపీలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిం చడం సబబుకాదన్నారు. కోర్టు అనుమతి ఇస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. డైరెక్టర్‌కు పంపిన మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానాల ప్రతులను అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  

స్టే లేని చోట్ల సిద్ధం: ఎస్‌ఈసీ 
కోర్టు స్టే ఉత్తర్వులు లేని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ చెప్పారు. రాష్ట్రంలో 126 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని, అయితే 75 మున్సిపాలిటీలపై సింగిల్‌ జడ్జి స్టే ఉత్తర్వులు జారీ చేశారని, మిగిలిన 51 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top