రేపటి నుంచి ఇక్కడే కరోనా పరీక్షలు

Telangana Government Starts Coronavirus Test In Hyderabad Says Etela - Sakshi

అనుమానాల నివృత్తికి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు: మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌/తాండూరు: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను సోమవారం నుంచి హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కిట్లు పంపించిందని, ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్టు పేర్కొన్నారు. వైరస్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తి కోసం 24 గంటల కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ఏవైనా సందేహాలుంటే 040–24651119కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

శనివారం మరో ముగ్గురు కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరారని, దీంతో ఇప్పటివరకు ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 18కు చేరిందని వెల్లడించారు. వీరిలో 11 మందికి కరోనా వైరస్‌ లేదని పరీక్షల్లో నిర్ధారణ అయిందని, మరో 7 మందికి సంబంధించిన ఫలి తాలు రావాల్సి ఉందన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరల్‌ వ్యాధులు సోకినప్పుడు ఉపయోగించే మందును అందుబాటులో ఉంచామన్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం కిట్స్‌ పంపించిందని, వారి సూచన మేరకు శాంపిల్‌ టెస్ట్‌ (ట్రయల్‌) నిర్వహించామని తెలిపారు. సోమవారం నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కరోనా వైరస్‌పై ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు.

తాండూరులో కరోనా కలకలం
 తాండూరు వాసికి కరోనా వైరస్‌ సోకిందన్న వార్త శనివారం కలకలం రేపింది. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన ఓ మహిళ చైనా నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా శంషాబాద్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయని ప్రచారం సాగుతోంది. ఆ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించగా, తనకు ఎలాంటి వైరస్‌ సోకలేదంటూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని పుకారు షికారు చేస్తోంది. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన ఆ మహిళ ఎవరు? తాండూరులో ఎక్కడ ఉంటారు? అనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోర గా.. తాండూరుకు చెందిన ఓ మహిళ చైనా నుంచి తిరిగి వచ్చిందనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై గాంధీ ఆస్పత్రి నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top