రంజాన్‌ తోఫా రెడీ

telangana government ramzan Goods Distribution - Sakshi

మెదక్‌ రూరల్‌: నిరుపేదలు సైతం అందరితో సమానంగా పండుగలను జరుపుకోవాలనే ఆలోచనతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వారివారి ముఖ్యమైన పండుగలకు ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కానుకలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో రంజాన్‌ కానుకలను పంపిణీ చేసేం దుకు సిద్ధంగా ఉంచారు.

జిల్లాలో మొత్తం 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానుకలను పంపిణీ చేసేందుకు మెదక్‌ నియోజకవర్గంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు మెదక్‌ పట్టణంలో, ఒకటి పాపన్నపేట, మరొకటి రామాయంపేటలో ఉన్నాయి. నర్సాపూర్‌ నియోజకవర్గంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నర్సాపూర్, కౌడిపల్లి, దౌల్తాబాద్‌ ఉన్నాయి. మొత్తం రెండు నియోజకవర్గాల్లో కలిపి ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇఫ్తార్‌ విందు కోసం ఒక్కో సెంటర్‌కు లక్ష రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది సెంటర్లకు రూ.8లక్షలు అందజేయనున్నారు.

పండుగకు వారం రోజుల ముందు 
ప్రతి సెంటర్‌లో 500 మంది పేదలను గుర్తించి వారికి దుస్తులతో ఉన్న గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేయనున్నారు. ఎనిమిది సెంటర్లకు కలిపి మొత్తం 4 వేల గిఫ్ట్‌ ప్యాకెట్లు జిల్లాకు చేరుకున్నాయి. రంజాన్‌ పండుగకు వారం రోజుల ముందు వీటిని అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి సెంటర్‌లో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు కోసం అందించిన డబ్బులను సైతం ఆ కమిటీ సభ్యుల ఖాతాలోనే వేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులు వారి సాంప్రదాయం ప్రకారం ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తారు. తమ ప్రాంతంలోని పేద ముస్లింలను ఆధార్‌కార్డు, ఆధాయ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్ధారిస్తారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన మత పెద్దలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆర్డీఓల పర్యవేక్షణలో కానుకల పంపిణీ చేపట్టనున్నారు.  మెదక్‌ నియోజకవర్గానికి సంబంధించి రంజాన్‌ కానుకలను మెదక్‌ కలెక్టరేట్‌లో, నర్సాపూర్‌ నియోజకవర్గానికి సంబంధించి నర్సాపూర్‌ ఆర్డీఓ కార్యాలయంలో భద్రపరిచారు. కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపంతో ఇఫ్తార్‌ విందు కోసం వచ్చిన డబ్బులను ఎవరి ఖాతాలో వేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top