తెలంగాణ పండగగా బతుకమ్మను ప్రభుత్వం గుర్తించడం మనందరికీ గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎన్జీ కాలేజీ మైదానంలో
నల్లగొండ కల్చరల్ :తెలంగాణ పండగగా బతుకమ్మను ప్రభుత్వం గుర్తించడం మనందరికీ గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండగలో సోమవారం మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమైతది అనే కుహనా విమర్శకులకు బతుకమ్మ పండగే సమాధానమన్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండగ నిర్వహించుకునే అవకాశం కలిగిందన్నారు.
బతుకమ్మ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు కేటాయించారన్నారు. మన సంస్కృతిని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చి ఉత్సహపరుస్తుం దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు రూ. 6.4 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ జీఓ విడుదలైయ్యిందని మంత్రి ప్రకటించారు. జిల్లాకు చెందిన శ్రీకాంతచారి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. చిరంజీవులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరికిషోర్ మాట్లాడారు.
న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అధ్యాపకురాలు సుధారాణి బృందం అందించిన వివరాల ప్రకారం జిల్లా విద్యాశాఖ బతుకమ్మకు మొదటి బహుమతిగా రూ. 1000, రెండవ బహుమతిగా ఆర్వీఎం మహిళలకు మంత్రి చేతులమీదుగా రూ. 500 అందచేశారు. ఈ సందర్భంగా లలిత సుమాంజలి చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావు, ఆర్‌ఐఓ ఎన్.ప్రకాశ్‌బాబు, డీఈఓ ఎస్.విశ్వనాథరావు, మాడా పీడీ సర్వేశ్వరరెడ్డి, ఆర్‌డీఓ జహీర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ గోనారెడ్డి, అశోక్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్య క్షుడు కందాల పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, భిక్షం, ఉదయ్‌కుమార్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
సౌభాగ్యాలను ఇచ్చే తల్లి బతుకమ్మ
సౌభాగ్యాలను అందించే తల్లిగా తెలంగాణలో బతుకమ్మ పూజలందుకుంటుంది. ప్రభుత్వమే ఈ పండగను నిర్వహించడం వల్ల, మహిళా ఉద్యోగులకు సంతోషంగా ఉంది. ఇంత గొప్ప పండగ కావటం గర్వంగా ఉంది.
వి.జ్యోతి, డీఈఓ కార్యాలయం
అద్భుతమైన పండగ
ఎన్నో ఔషధ గుణాలున్న పూలతో నిర్వహించుకునే అద్భుతమైన పండగ బతుకమ్మ. జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దమని బతుకమ్మను వేడుకోవటం జరుగుతుంది. ప్రపంచంలో మహిళలు కోసం ప్రత్యేకంగా ఉన్న గొప్ప పండగ బతుకమ్మ.
- కె.కవిత, ఆర్‌వీఎం