యూరియా కోసం రైతన్నల బారులు

Telangana Farmers Facing Problems For Urea - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

క్యూలో నిలబడి మృతి చెందిన రైతు
యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి రైతు మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య(69) ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్నివెంటనే స్థానిక అస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడు అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

తూప్రాన్‌లో రైతన్నల ధర్నా
మెదక్ జిల్లా  తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్‌లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిద్దిపైట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో యూరియా కోసం రైతు సేవాసమితి వద్ద బారులు తీశారు. జనగామా జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం పనులు వదిలిపెట్టుకుని క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రైతు మృతి చెందడం దురదృష్టకరం
రైతు ఎల్లయ్య మృతి పట్ల సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. గురువారం ఆయన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టేవారని ఎగతాళి చేసిన కేసీఆర్‌కు.. రాష్ట్ర రైతుల బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 30 రోజుల ప్రగతి పేరుతో గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top