ఏర్పాట్లు ముమ్మరం

Telangana Elections Preparations Medak - Sakshi

సాక్షి,మెదక్‌:  జిల్లాలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకుంటున్నాయి. తుది ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సమకూర్చుకోవటం తదితర అంశాలపై అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రెవెన్యూ అధికారులు జిల్లా డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా ఓటర్ల సవరణ పూర్తి చేయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈనెల 14, 15 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల వారీగా ప్రచార కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

సోమవారం ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను అనుసరించి మెదక్‌ నియోజకవర్గంలో 1,82,464 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 88,404 మంది పురుషులు, 94,055 మహిళలు, ఐదుగురు ఇతరులున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో మొత్తం 1,88,909 ఓటర్లు ఉండగా వీరిలో 93,703 పురుషులు, 95,201 మహిళా ఓటర్లు, ఐదుగురు ఇతరులున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయి. ఓటర్ల సవరణ  అక్టోబర్‌ 6వ తేదీ వరకు పూర్తి కానుంది. ఆ తర్వాత తుది ఓటరు జాబితా వచ్చేనెల 8న ప్రచురించనున్నారు. ఓటరు జాబితా సవరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

మొదలైన ఫైళ్ల తరలింపు..
ఎన్నికలు నవంబర్‌లో ఉండవచ్చని తెలుస్తుండటంతో అధికారుల పనితీరులో వేగం పెరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జరిగాయి. దీంతో ఎన్నికల నిర్వహణ సమాచారం మొత్తం సంగారెడ్డి కలెక్టరేట్‌లోనే ఉంది. సంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి 2014 ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం సమాచారం, ముఖ్య ఫైళ్లను మెదక్‌కు తీసుకువస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 509 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో 261, మెదక్‌ నియోజకవర్గంలో 248 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో 509 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 29 పెరిగి ఆ సంఖ్య 538కి చేరుకోనుంది.

17వ తేదీ నుంచి అవగాహన
ఈ ఎన్నికల్లో వీవీ పాట్‌ ఈవీఎంలు వాడనున్నారు. ఈవీఎంల వాడకంపై కొన్ని పార్టీలు అభ్యంతరం వెలిబుచ్చుతున్న నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీవీ పాట్‌(ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) ఈవీఎంలు వాడాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీవీ పాట్‌ ఈవీఎంలో ఓటరు ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటు వేసింది అన్న వివరాలతో ఓటింగ్‌ స్లిప్‌ ప్రింట్‌ అవుతుంది. ప్రింట్‌ అయిన స్లిప్‌ను ఓటరు ఏడు సెకండ్లపాటు డిస్‌ప్లేలో చూడవచ్చు.   బెంగుళూరులోని బీహెచ్‌ఈఎల్‌ నుంచి 600 వరకు వీవీపాట్‌ ఈవీఎంలు జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతగా 20 వీవీ పాట్‌ ఈవీఎంలు ఈనెల 17న జిల్లాకు వస్తున్నాయి. వీటితో అన్ని మండలాల్లో ఓటర్లు ఎదుట ప్రదర్శించనున్నారు. ఓటర్లకు వీవీ పాట్‌ ఈవీఎంల పనితీరు వివరించి వాటి పనితీరును ప్రత్యక్షంగా చూపనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top