సృజనాత్మకతకు టీ–వర్క్స్‌

సృజనాత్మకతకు టీ–వర్క్స్‌ - Sakshi


నూతన సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్‌ ఉత్పత్తుల రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం

హార్డ్‌వేర్‌ నమూనాల అభివృద్ధి, ఇంక్యూబేషన్, నైపుణ్యాభివృద్ధికి సదుపాయాలు

♦  ఆలోచనతో వచ్చి ప్రొడక్ట్‌తో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు  




సాక్షి, హైదరాబాద్‌: మీ దగ్గర ఓ సరికొత్త ఆలోచన ఉందా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారా.. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్‌)ను అభివృద్ధి చేసుకుని వెళ్లగలిగేలా సదుపాయాలను కల్పిస్తూ ‘టీ–వర్క్స్‌’ పేరుతో నూతన సంస్థకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్‌ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ స్థాయి నమూనాల రూపకల్పన (ప్రొటోటైపింగ్‌) సదుపాయంతో పాటు ఔత్సాహిక పరిశోధకుల అభివృద్ధి కేంద్రం (ఇంక్యుబేషన్‌ సెంటర్‌), నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఈ ‘టీ–వర్క్స్‌’లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.



ఈ మేరకు లాభాపేక్ష లేని సంస్థగా టీ–వర్క్స్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్‌ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ (ఎలక్ట్రానిక్స్‌) వ్యవహరిస్తారు.



టీ–వర్క్స్‌ ప్రధాన ఉద్దేశాలివీ..నమూనాల ఉత్పత్తి కోసం:

ఏదైనా ఓ ఆలోచనతో ఔత్సాహిక పరిశోధకులు అడుగు పెట్టి.. ఉత్పత్తిని రూపొందించుకుని బయటకు వెళ్లేందుకు కావాల్సిన అత్యాధునిక సదుపాయాలు, యంత్రాలు టీ–వర్క్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తుల నమూనాల అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు.



ఇంక్యుబేషన్‌:

హార్డ్‌వేర్‌ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, హార్డ్‌వేర్‌ రంగ అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేందుకు ఇంక్యుబేషన్‌ కేంద్రం ఉపయోగపడనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top