పన్ను తగ్గించకపోతే చర్యలే | Sakshi
Sakshi News home page

పన్ను తగ్గించకపోతే చర్యలే

Published Thu, Nov 23 2017 3:00 AM

Tax department Warning - Sakshi

సాక్షి హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గిన వస్తువుల ధరలను వెంటనే తగ్గించి అమ్మాలని, లేదంటే చర్యలు తప్పవని రాష్ట్ర పన్నుల శాఖ హెచ్చరిం చింది. ఈ బాధ్యతను కంపెనీలే తీసుకోవా లంది. పన్నుల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు కమిషనర్‌ జె.లక్ష్మీనారాయణ తదితర ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చాలా వస్తువుల ధరలను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ ఈనెల 10న తీసుకున్న నిర్ణయం 15 నుంచి అమల్లోకి వచ్చిందని, తగ్గిన పన్నుకు అనుగుణంగా వస్తువుల ధరలను తగ్గించాలని కోరారు. కేవలం 50 వస్తువులకు మాత్రమే 28 శాతం పన్ను వర్తిస్తుందని, మిగిలిన వస్తువుల ధరలు తగ్గిన పన్నుకు అనుగుణంగా తగ్గించాలని సూచించారు.

జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం ద్వారా జరిగే లబ్ధి వినియోగదా రునికి చేరేవరకు ఆయా కంపెనీలే బాధ్యతలు తీసుకోవాన్నారు. దరలు తగ్గించని పక్షంలో యాంటీప్రాఫిటరింగ్‌ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో హెచ్‌యూఎల్, ఐటీసీ, కాల్గేట్, పామోలి వ్, పీఅండ్‌జీ, గోద్రెజ్, డాబర్‌ ఇండియా, విప్రో, ఫ్యూచర్‌ రిటైల్‌ లాంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రతినిధులతో పాటు మోర్, రిలయన్స్, డీమార్ట్, రత్నదీప్, మెట్రో, మ్యాక్స్‌ హైపర్, స్పార్, క్యూమార్ట్‌ సూపర్‌ మార్కెట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.


28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గిన వస్తువులివే
వైర్లు, కేబుల్స్, ఎలక్ట్రికల్‌ ఫిట్టిం గులు, చెక్క వస్తువులు, ఫైబర్‌ బోర్డులు, ప్లైవుడ్, ఫర్నీచర్, పరుపులు, సూట్‌కేసులు, డిటర్జెంట్లు, చర్మ సౌందర్య సాధనాలు, షాంపూలు, రేజర్‌ బ్లేడులు, ఫ్యాన్లు, పంపులు, కంప్రెషర్లు, సంగీత సాధనాలు, చాక్‌లెట్లు.

జీఎస్టీఆర్‌–3బీ అపరాధ రుసుము రద్దు
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టం ప్రకారం రాష్ట్రంలోని రిజిస్టర్డ్‌ డీలర్లు ఫైల్‌ చేయాల్సిన జీఎస్టీఆర్‌–3బీ రిటర్న్‌ లు సకాలంలో చేయకపోతే విధించే అపరాధ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలకు సంబంధించిన రుసుమును రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement