సులభంగా ఎంసెట్‌! 

Talangana Eamcet questions are easier than compared to the past - Sakshi

కాస్త ఎక్కువ ఆలోచిస్తేనే రాసేలా 10 ప్రశ్నలు 

కొంచెం కఠినంగా మరో 5 ప్రశ్నలు.. సులభంగానే కెమిస్ట్రీ 

ఉదయం పరీక్షకు 94.1 శాతం, మధ్యాహ్నం పరీక్షకు 94.4 శాతం హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ప్రశ్నల సరళి గతంలో పోల్చితే ఈసారి సులభంగానే ఉందని సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ ఎంసెట్‌లో గతంలో కంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ సులభంగానే ఉందని, గణితంలో మాత్రం కొన్ని ప్రశ్నలు విద్యార్థులను కొద్దిగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లు తెలిపారు. అయితే గణితంలో 55వ ప్రశ్న నుంచి 65వ ప్రశ్న వరకు 10 ప్రశ్నలు కాస్త ఎక్కువ ఆలోచిస్తే జవాబు రాసేలా ఉండగా, 10వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఐదు ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎంసెట్‌ 2019 పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఇంజనీరింగ్‌ విభాగంలోని మొదటి రోజు పరీక్ష సెట్‌ కోడ్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి డ్రా తీసి ఎంపిక చేశారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు, పరీక్షలు జరుగతున్న తీరును పరిశీలించారు. 

83 కేంద్రాల్లో పరీక్షలు..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు రాష్ట్రంలోని 83 పరీక్ష కేంద్రాల్లో 25,023 మంది విద్యార్థులకు 23,543 మంది (94.1 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన పరీక్షకు 24,174 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 22,807 మంది (94.4 శాతం) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం జరిగిన పరీక్ష రాసేందుకు 3,480 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 2,715 మంది (78.1 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 4,229 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 3,315 మంది (78.4 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 1,42,218 మందికి మొదటి రోజు 56,906 మందికి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయగా, 52,380 మంది హాజరయ్యారు. మిగిలిన వారికి ఈ నెల 4, 6 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంసెట్‌ కమిటీ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్‌ యాదయ్య పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top