ఎంపీ టికెట్‌ ఎవరికో! 

T Congress Leaders Writing For MPs Tickets Warangal - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని భావించిందో ఏమో..  కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ముందుగానే కసరత్తు మొదలెట్టింది. లోక్‌సభ ఎన్నికల కోసం త్వరలోనే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఆశావహుల నుంచి  జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ద్వారా టీపీసీసీ ఎన్నికల సంఘం దరఖాస్తులను స్వీకరించింది.

చాలా మంది డీసీసీలకే దరఖాస్తు చేసుకోగా... కొందరు నేరుగా టీపీసీసీ, ఏఐసీసీలకు 20వ తేదీ వరకు తమ అభ్యర్థనలను పంపుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ (ఎస్సీ), మహబూబాబాద్‌ (ఎస్టీ) నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 77కు చేరింది. కాగా అభ్యర్థుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు వచ్చిన దరఖాస్తులపై మంగళవారం టీపీసీసీ ఎన్నికల సంఘం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మూడు గంటలకు పైగా కసరత్తు చేసింది. ఒక్కో నియోజకరానికి రెండు నుంచి ఐదు పేర్లను హైకమాండ్‌ పరిశీలనకు పంపిన టీపీసీసీ ఎన్నికల సంఘం... వరంగల్‌ నుంచి ముగ్గురు, మహబూబాబాద్‌ నుంచి ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

హైకమాండ్‌కు ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లు..
అసెంబ్లీ ఎన్నికల అనంతరం వస్తున్న లోక్‌సభ ఎన్నికల్లో పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు డీసీసీల నుంచి అందిన జాబితాలను కూడా కీలకంగా భావించారు. ఈ మేరకు వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు.

ఈ కమిటీల ద్వారా వరంగల్‌ లోక్‌సభ స్థానం కోసం వచ్చిన 34 దరఖాస్తులు, మహబూబాబాద్‌ కోసం వచ్చిన 43 దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్‌ నుంచి నాలుగు, మహబూబాబాద్‌ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్‌ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్‌ కోసం మాజీ ఎంపీ పోరిక బలరామ్‌నాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది.

ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారం.. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన....
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ఏఐసీసీ ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తదితరుల ఎన్నికల కమిటీ మంగళవారం సుమారు మూడు గంటలకు పైగా కసరత్తు చేసిందన్నారు. వరంగల్, మహబూబాబాద్‌ స్థానాల కోసం 77 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... వరంగల్‌ నుంచి నాలుగు, మహబూబాబాద్‌ నుంచి ఇద్దరు పేర్లను ఈ కమిటీ ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపినట్లు సమాచారం. ఈ జాబితాపైనా మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల ప్రకటనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరులో గాని, మార్చి మొదటి వారంలో గాని అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ సీనియర్లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top